ప్రభాస్‌ అంటే ఇష్టం లేని వారెవరు?: ‘సలార్‌’ ప్రతినాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

‘ప్రభాస్‌ని ఎవరైనా ఇష్టపడతారు. నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. నేనూ తరచూ మాట్లాడే వ్యక్తుల్లో ప్రభాస్‌ ఒకరు. సెట్‌లో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అందరి కోసం భోజనం తెప్పిస్తాడు. తన చుట్టూ ఉండేవాళ్లు ఆనందంగా ఉండేలా చూస్తాడు. అభిమానులు ఆయన్ను డార్లింగ్‌ అని ఎందుకంటారో అప్పుడే అర్థమైందని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ఈ నెల 22న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘సలార్‌’లో ప్రభాస్‌ దేవా పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాడు. నేను వరదరాజ మన్నార్‌గా కనిపిస్తా. నా కెరీర్‌లో ఇంత గొప్పపాత్ర చూడలేదు. ఈ తరహా కథలో నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా.

‘సలార్‌’తో నా కల నెరవేరింది. ఇప్పటి వరకు టీజర్‌, ట్రైలర్‌లో చూసింది చాలా తక్కువ. ఇందులో యాక్షన్‌ మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కథ ఇది. థియేటర్‌కు వచ్చిన వారంతా మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్‌ అవుతుందని పూర్తి నమ్మకంగా ఉంది ‘సలార్‌’ రెండో భాగం లీడ్‌ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం చిత్ర బృందం ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. అభిమానులు వినూత్న రీతిలో సినిమాపై అభిమానం చాటుతున్నారు. కెనడాలోని ప్రభాస్‌ అభిమానలు ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్‌ సెల్యూట్‌ చేశారు. ‘సలార్‌’ లుక్‌కు సంబంధించిన భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసి దాని పైన ఒకేసారి ఆరు హెలికాప్టర్లు గాల్లో ఎగురుతూ సెల్యూట్‌ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను హోంబలే సంస్థ ట్వీట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం మొదటి టికెట్‌ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు.