ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న’సలార్’ సినిమా డిసెంబర్ 22 న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా ఎన్నో విడుదల తేదీలు ప్రకటించిన తరువాత ఇప్పుడు డిసెంబర్ 22తేదీ ఖరారు చేశారు. ఇందులో నటించిన ప్రభాస్ కూడా ఈమధ్యనే హైదరాబాదు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచారాలు డిసెంబర్ మొదటి వారం నుండి మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ కూడా డిసెంబర్ 1న సాయంత్రం విడుదల చేస్తున్నారు. అయితే ఈలోపు ‘సలార్’ సినిమా సెన్సారు కార్యక్రమాలకి సన్నాహాలు చేస్తున్నట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అందుకోసమనే ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు చేత డబ్బింగ్ చెప్పించే పనిలో చిత్ర నిర్వాహకులు వున్నారని తెలిసింది. ఒకటిరెండు రోజుల్లో ‘సలార్’ సెన్సార్ అయ్యే సూచనలు వున్నాయని చెబుతున్నారు.
ప్రముఖ మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ విషయాలు కూడా చాలా కఠినతరం చేశారట. ఆమధ్య నటుడు విశాల్ సినిమాల సెన్సార్ విషయంలో చాలా అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపణ చెయ్యడం, ఆ తరువాత దానిమీద తీవ్రమైన చర్చలు జరిగిన విషయం కూడా తెలిసిందే.
ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఈ సినిమా అయినా సెన్సార్ సభ్యులు చూసినప్పుడు అక్కడికి ఎవరినీ అనుమతించేది లేదని అందుకని ’’సలార్’ సెన్సారు జరిగేటప్పుడు కూడా టాక్ అసలు బయటకి రాదని తెలుస్తోంది.