Adani – Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అదానీ గ్రూప్ ఒప్పందాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ సంచలన నివేదికలో, అదానీ గ్రూప్ సరఫరా చేసిన సౌర విద్యుత్ ఒప్పందంలో రూ.1750 కోట్లు వైసీపీ కీలక నాయకుడి వరకు వెళ్లినట్లు పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై అమెరికా కోర్టులో అభియోగాలు నమోదు కావడంతో ఈ వివాదం భారతదేశానికి చేరింది.
అయితే అందరి ఫోకస్ చంద్రబాబు (Chandrababu) పైనే ఉంది. అసలు ఈ వివాదంలో ఆయనే తీసుకునే నిర్ణయం మాట్లాడే విధానం ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అసలే విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) జగన్ (YS Jagan) సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీతో కుదుర్చుకున్న రూ.7000 కోట్ల సౌర విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన షర్మిల, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదానీ గ్రూప్ నుంచి చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)కి కూడా ఏమైనా ఆఫర్లు అందాయా? అంటూ ఆమె సందేహాలు వ్యక్తం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సీపీఐ నేత రామకృష్ణ కూడా ఇదే అంశంపై స్పందించారు. అదానీ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అదానీ (Adani) వంద కోట్లు ఇవ్వబోతున్నా తీసుకోనని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రామకృష్ణ స్వాగతిస్తూ, అదే ధోరణి ఏపీ ప్రభుత్వం చూపించాలన్నారు.
Chandrababu: AP వరద బాధితులకు నందమూరి మోహనకృష్ణ గారు, CM శ్రీ నారా చంద్రబాబు గారిని కలిసి 25 లక్షల విరాళం
అదానీకి జగన్ (YS Jagan) హయాంలో కేవలం సౌర విద్యుత్ ప్రాజెక్టులే కాదు, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలకమైన వ్యవస్థలపైనే ఆధికారం అప్పగించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఒప్పందాల్లో పారదర్శకత లేదని, జగన్ (YS Jagan) ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఈ అంశంపై పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనిపించకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా, చంద్రబాబు (Chandrababu)పై ఒత్తిడి మరింత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ – అదానీ డీల్ మీద చర్చ ఇంకా ముదురుతున్నప్పుడు, ఈ వివాదం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే. కానీ విపక్షాలు మాత్రం ఈ అంశాన్ని బలంగా వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రతిపక్ష నేతలకు ఇదే బలంగా మారింది. అయితే చంద్రబాబు (Chandrababu) ఎందుకు ఈ విషయాన్నీ టచ్ చేయడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. మరి చంద్రబాబు ఆ కామెంట్స్ కు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.