విశాఖ ఉక్కు –  ఆంధ్రుల హక్కు 

ys jagan letter wrote to pm modi
నిజమే…రెండు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టేసింది.  తన వాటాలు అమ్మేసుకుంటుందట.  ఇలాంటి నిర్ణయం కేంద్రం నుంచి వెలువడినపుడు ఆంధ్రుల మనస్సులు కలుక్కుమనడం అత్యంత సహజం.  ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం అంత సులభంగా నడిచి వచ్చింది కాదు.    అయిదు  కోట్లమంది ఆంధ్రుల పోరాటఫలితం.  ఎందరెందరో త్యాగమూర్తులైన నాయకులు చేసిన ఉద్యమ ఫలితం.  కర్మయోగి,  నిరాడంబరుడు, నిస్వార్ధపరుడు  అయిన తెన్నేటి విశ్వనాధం నాయకత్వంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆందోళన జరిగింది.  “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది.  ఒక్క విశాఖలోనే కాదు…వాడవాడలా ఉక్కు కర్మాగారంకోసం నిరాహారదీక్షలు జరిగాయి.  అందరి సమైక్య పోరాట ఫలితంగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1971 వ సంవత్సరంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి నాందీవాచకాన్ని పలికారు.  ఆ తరువాత పదేళ్లకు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైంది.  మళ్ళీ ఇందిరాగాంధీ హస్తాలమీదుగానే ఉక్కు సవ్వడులు సాగరపు అలల హోరుతో పోటీ పడ్డాయి.  విశాఖవాసుల పాలిటి మురిపించే మువ్వలు అయ్యాయి.  ప్రస్తుతం ఉక్కు కర్మాగారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నలభైవేలమంది ఉద్యోగులు చెమటోడ్చుతూ దేశానికి సంపదను సృష్టించి అందిస్తున్నారు.    
 
ys jagan letter wrote to pm modi
ys jagan letter wrote to pm modi
అన్నింటిని మించి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద నగరమైన విశాఖ ప్రతిష్టను అంబరం తాకించిన సంస్థ ఇది.  ఈ కర్మాగారం  వల్లనే విశాఖను ఉక్కునగరం అని కూడా పిలుస్తారు.  ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతకు మించిన ద్రోహం లేదు.    కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో ముందుచూపుతో ప్రభుత్వరంగంలో సంస్థలను స్థాపించి లక్షలమందికి  ఉపాధి కల్పించడమే కాకుండా లక్షల కోట్ల సంపదను ఈ దేశానికి ఆర్జించి పెట్టాయి.  కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నన్నాళ్ళు అనేక ప్రభుత్వ సంస్థలు లాభాల్లోనే నడిచాయి.  కానీ అదే కాంగ్రెస్ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థికసంస్కరణల మూలంగా విదేశీ సంస్థలనుంచి పోటీ పెరిగి మన సంస్థలు నష్టాలబాట పట్టాయి.   ఆ తరువాత వాజపేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నష్టాలతో కునారిల్లుతున్న సంస్థలను  లాభాలబాట పట్టించడం విడనాడి  డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ప్రయివేట్ సంస్థలకు అమ్మేయడం  ప్రారంభం అయింది.    ఈ క్రమంలో లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను నష్టాలపాలయ్యేట్లుగా విధానాలు రూపొందించడం కూడా ఒక భాగం.  లాభాల్లో ఉన్న సంస్థలు నష్టాలపాలయ్యేలా విధానాలను రూపొందించడం, అదే సమయంలో ప్రయివేట్ రంగం వారికి పెద్ద ఎత్తున రాయితీలు, ఊరటలు, ఉద్దీపనలు కల్పించడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చెయ్యడం, లేదా ప్రజలకు ప్రభుత్వ సేవల మీద విరక్తి పుట్టించడం, అదే సమయంలో ప్రయివేట్ రంగ సంస్థలు తక్కువ సిబ్బందితోనే ఎక్కువ లాభాలు ఆర్జిస్తూ ప్రభుత్వరంగానికి సవాళ్లు విసరడం లాంటి సంఘటనలు ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తాయి.  ఆ నష్టాలను బూచిగా చూపుతూ సదరు సంస్థలను ప్రయివేట్ సంస్థలకు అమ్ముకుని ఆ డబ్బును ఖజానాలో వేసుకోవడం గత ఇరవైఏళ్లుగా ఒక తంతుగా కొనసాగుతున్నది.  ఇది ఎలా ఉందంటే తలనొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకోవడానికి బదులుగా తలను నరుక్కున్న చందంగా తయారయింది.    
 
మోదీ ప్రభుత్వం వచ్చాక నష్టాలలో మునిగిపోయిన సంస్థలనే కాదు..లాభాల్లో నడుస్తున్న సంస్థలను కూడా అమ్మేయడమే ధ్యేయంగా పెట్టుకున్నది.     కేవలం కర్రపెత్తనం చెయ్యడమే పరమావధిగా లాభాల్లోని ఎల్లైసి, రైల్వే  లాంటి సంస్థలను కూడా తెగనమ్మేయడానికి బీజేపీ ప్రభుత్వం  తెగించింది.  ఆ క్రమంలోనే లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమందికి కల్పతరువుగా విలసిల్లుతున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మడానికి సిద్ధం అయింది.  ఇన్నాళ్లూ ఎయిర్ ఇండియా, ఎల్లైసి, రైల్వే లాంటి ఆస్తులను అమ్మేస్తుంటే మనకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు.  విశాఖ ఉక్కు మన రాష్ట్రంలోనిది కావడం, మనరాష్ట్రంలోని ఏకైక పెద్ద పరిశ్రమ అదే కావడంతో ఆంధ్రుల రక్తం మరిగిపోతున్నది.    విశాఖ ఉక్కును అమ్మడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు.  
 
 
విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల మనోభావాలకు ఒక ప్రతీకగా  అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదికి ఒక లేఖను వ్రాశారు.  ప్రయివేట్ వారికి అమ్మే యోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  దాంతో పాటే నష్టాలను నివారించడానికి కొన్ని సూచనలు కూడా చేశారు.   ముఖ్యమంత్రి వ్రాసిన లేఖలో ఒక గుర్తించదగిన పాయింట్ ఉన్నది.  2002  నుంచి 2015  వరకు విశాఖ ఉక్కు ప్లాంట్ లాభాల్లోనే ఉన్నదని ప్రస్తావించడం ద్వారా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచే నష్ఠాల బాట పట్టిందని జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపించారు.  అలాగే సంస్థ మళ్ళీ లాభాల బాటలో నడవాలంటే ఏమి చెయ్యాలో కొన్ని సలహాలను కూడా ఇచ్చారు.    అధికారపార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో నిరసన  గళాన్ని వినిపించారు.  లోక్ సభలో పూర్తి ఆధిక్యత ఉన్నదని విర్రవీగుతున్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది సందేహమే.   పైగా ఈ అమ్మకం ప్రతిపాదన 2018  అక్టోబర్ లోనే వచ్చిందని మొన్న రాజ్యసభలో కేంద్రమంత్రి చెప్పడంతో విశాఖ ఉక్కుకు ఉరితాడు బిగించి రెండేళ్లు దాటిందని, ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు తెలుసని బయటపడింది.   
 
అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కేంద్రం ఆస్తి అయిన విశాఖ ఉక్కు  ఫ్యాక్టరీని వారు అమ్మకానికి పెట్టుకుంటే అది జగన్మోహన్ రెడ్డి తప్పయినట్లు, లక్షలకోట్లు దోచుకోవడానికి జగన్ పధకాన్ని వేసినట్లు  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.  తమ ఆస్తులను అమ్మకానికి పెట్టిన కేంద్రప్రభుత్వాన్ని పన్నెత్తి విమర్శించకుండా,  అమ్మవద్దు అని ప్రధానికి లేఖను వ్రాసిన జగన్మోహన్ రెడ్డిని తీవ్రపదజాలంతో విమర్శిస్తున్నారు!      ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఆయన మహోద్యమాన్ని నిర్మిస్తారట!  తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాభాల్లో నడుస్తున్న నిజం షుగర్ ఫ్యాక్టరీని, ఆల్విన్ లాంటి  సంస్థలను తెగనమ్మేసిన చంద్రబాబు ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రయివేట్ వారికి దక్కకుండా ఉద్యమం చేస్తామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియడంలేదు జనానికి.  ప్రయివేటీకరణను ఆయన అధికారంలో ఉన్నప్పుడు జోరుగా సమర్ధించడమే కాక అమలు చేశారు కూడా.  కామధేనువు లాంటి విజయ డైరీ, చిత్తూర్ డైరీలను కేవలం తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ను లాభాల్లో దూసుకువెళ్లడానికి వీలుగా నిర్వీర్యం గావించి చివరకు దివాళా తీయించిన సంగతి ఆయన విస్మరించినా ప్రజలు మరచిపోరు.  ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో సుమారు పాతికవేలమంది బంగారం లాంటి ఉద్యోగాలను కోల్పోయి వీధులపాలయ్యారు.  అలాంటి చంద్రబాబు నేడు విశాఖ ఉక్కు కోసం ఉద్యమాన్ని నిర్మిస్తారట!  ఒక్క చంద్రబాబే కాదు…ఇంకా చాలామంది రాబోయే రోజుల్లో ఉద్యమవీరులుగా తెరమీదికి వస్తారు.  ఎంత అలజడులు  సృష్టించాలో అంత సృష్టిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి కేంద్రం వాటాలను ప్రయివేట్ వారికి అమ్మకుండా నిలువరించాలి.  కుతంత్రాలు పన్నుతూ ప్రజల శవాల మీద రాజకీయ పేలాలు ఏరుకునే కుమతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.    
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు