జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం.. అందునా, వైవాహిక జీవితంపై అధికార వైసీపీ అత్యుత్సాహం చూపుతున్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది బహిరంగ రహస్యం. అందులో దాపరికం ఏమీ లేదు.
అంతా చట్టబద్ధంగానే జరిగిన వ్యవహారమది. ఇందులో నైతికత.. అన్న కోణంలో వైసీపీ ప్రశ్నిస్తే, దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. చట్టబద్ధంగా చూస్తే, పవన్ కళ్యాణ్‌ని తప్పు పట్టడం అనేది వైసీపీకే నష్టం కలిగించే అంశం.
ముఖ్యమంత్రి సైతం పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తుంటారు.. అదీ ప్రజాధనంతో నిర్వహించే బహిరంగ సభల్లో. కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తే సరిపోయేదానికి, ముఖ్యమంత్రి ఎందుకంత ఆవేశపడతారో ఏమో.!
గడచిన రెండు మూడు రోజులుగా లోకల్ మీడియా, నేషనల్ మీడియా.. అంతా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంపై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ సృష్టించి పడేశాయి. ఇవన్నీ పెయిడ్ ఆర్టికల్స్ అన్నది బహిరంగ రహస్యం. ఎంతమొత్తంలో ఈ రాతల కోసం వైసీపీ ఖర్చు చేయించింది.? అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంతలోనే, జనసేన పార్టీ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చింది. జనసేన అధినేత హైద్రాబాద్‌లో తన సతీమణి అన్నా లెజినెవాతో కలిసి ప్రత్యేక పూజలు చేశారన్నది ఆ ఫొటో తాలూకు సారాంశం. వారాహి విజయ యాత్ర.. విజయవంతమైన దరిమిలా ఈ పూజలు చేశారట పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినెవా.
కొన్నాళ్ళుగా అన్నా లెజినెవా మీడియా కంటపడలేదు. దాంతో, డివోర్స్ గాసిప్స్‌కి బలం చేకూరింది. కానీ, ఒక్క ఫొటోతో.. అధికార వైసీపీకే కాదు, చాలా మీడియా సంస్థలకు చావు దెబ్బ కొట్టారు జనసేనాని.