రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాట్ సీట్లలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా.. వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అంగ, అర్ధబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్న వీరిరువురూ తలపడుతున్న గన్నవరంలో తాజా పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…!
రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో… కొన్ని కీలక నియోజకవర్గాల్లో గెలవడం కూడా రెండు పార్టీలకూ అంతే ముఖ్యం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో తమ పార్టీ టిక్కెట్ పై గెలిచి వైసీపీకి జై కొట్టడంతో… వంశీపై బాబు & కో నిప్పులు చెరుగుతున్నారు. ఒక్కరికే అలా అయిపోతే.. 23 మందిని లాక్కున్నపుడు జగన్ ఎంత ఇబ్బంది పడి ఉంటారో బాబుకు తెలిసొచ్చిందా అని వైసీపీ నుంచి కౌంటర్!!
ఈ నేపథ్యంలో… రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గన్నవరంలో మరోసారి జెండా ఎగరేయాలని టీడీపీ భావిస్తుండగా.. ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వైసీపీ అనుకుంటుంది. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలవగా.. వంశీ వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
వాస్తవానికి గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీలు అత్యధికంగా ఉంటారు. దీంతో… తొలుత బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని టీడీపీ భావించింది. ఇందులో భాగంగా… బీసీ నేతలైన బచ్చుల అర్జునుడు, కొలుసు పార్థసారధిని గన్నవరం నుంచి బరిలోకి దింపాలని భావించింది. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ అర్జునుడు మరణించడం, పార్ధసారథికి నూజివీడు టికెట్ కేటాయించాల్సి రావడంతో… వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం స్థానాన్ని కేటాయించారు బాబు!
గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం.. స్థానికంగా అందరికి అందుబాటులో ఉండటం.. సేవా కార్యక్రమాలు చేయడం వంటివి వెంకట్రావుకు అనుకూల అంశాలని అంటున్నారు. గత ఎన్నికల్లో స్పల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఈసారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే వైసీపీలో పట్టు సాధించిన వంశీ… తన బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడయితే గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారట!
ప్రస్తుతం ఇద్దరి వెనుకా భారీ ఎత్తున జనం తిరుగుతున్నారు.. చేతికి ఎముక లేదన్నట్లుగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ఈసారి గెలుపుకోసం ఇద్దరూ సర్వస్వం ఒడ్డి ప్రయత్నిస్తున్నరని తెలుస్తుంది. దీంతో… వీరిలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనేది చెప్పడం ఆల్ మోస్ట్ అసాధ్యం అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి గన్నవరం లో ఈసారి జెండా పాతేది ఎవరో తెలియాలంటే… వేచి చూడాల్సిందే!!