మోదీ ట్రిపుల్ తలాక్ రాజకీయం, ఆశా లేక అత్యాశా!

(మల్యాల పళ్లంరాజు)

 

ఓటుకు కులం లేదు. మతం లేదు. కానీ రాజకీయ పార్టీలకు అధికారం దక్కాలంటే కులం, మతం ఓట్లే ముఖ్యం. కులాల వారికీ మతాల వారికీ గాలం వేసి ఓట్లు రాబట్టుకోవడమే వివిధ రాజకీయ పార్టీల తంత్రం. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి.2019లో కూడా కేంద్రంలోకి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలన్న పట్టుదలతో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి తన రాజకీయ ఎత్తుగడలకు తెరలేపింది.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలిచిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూసేందుకు కాంగ్రెస్ అత్యంత చాకచక్యంతో పావులు కదిపి. తమ పార్టీతో పోలిస్తే.. సగం కూడా సీట్లు రాని జనతాదళ్ (సెక్యులర్) పార్టీనేత హెచ్.డి. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడంతో కొత్త రాజకీయ మంత్రాంగానికి నాంది పడింది.

కుమార స్వామి ముఖ్యమంత్రి పదవీ స్వీకారం సందర్భంగా దేశంలో కీలక జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను ఆహ్వానించడంతో కొత్త ప్రజాస్వామ్య, లౌకిక రాజకీయ కూటమికి తెరలేచింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్ తో పాటు ఇతర ముఖ్యనాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ తనయుడు సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ , ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఇతర హేమాహేమీలు హాజరై, బీజేపీ యేతర ప్రతిపక్షాలన్నీ ఏక మవుతున్నాయని, భవిష్యత్ లో కొత్త కూటమి అధికార ఎన్ డీఏకు సవాల్ గా మారతాయని చెప్పకనే చెప్పారు. ఇది అధికార భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మహానేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పెను సవాల్ గా పరిణమించే పరిణామం.

ప్రతిపక్షాల ఐక్యతారాగంతో భారతీయ జనతాపార్టీ తన వంతు సన్నాహాలు ఆరంభించింది. అపర చాణుక్యుడుగా పేరొందిన నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కీలక నేతలతో వ్యూహరచనలో పడ్డారు. నిజానికి 2014లో సార్వత్రిక ఎన్నికలలో నెగ్గి కేంద్రంలో అధికారం చేపట్టడానికి, 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాల అనైక్యతే ప్రధాన కారణం. దేశంలో పలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల ముస్లీంలు, ఓట్ బ్యాంక్ వ్యతిరేక ఓటర్లు, యూపీలో కీలకమైన సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీల ఓట్లు చీలి పోవడంతోనే బీజేపీకి అధికార పీఠాలు దక్కాయి. 2019లో తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలంటే.. 2014లో అనుసరించిన రాజకీయ వ్యూహాలు పనిచేయవు. కొత్త వ్యూహరచన జరగాల్సిందే. నరేంద్ర మోడీ అండ్ కో ప్రస్తుతం అదే యత్నాలలో ఉంది.

నూటికి నూరు శాతం హిందుత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీకి ముస్లీంవర్గాల నుంచి ఓట్లు సంపాదించడం ఓ సవాల్. కరడు కట్టిన మతవాదులు ఎట్టి పరిస్థితుల లోనూ బీజేపీకి తమ మతస్థులను ఓట్లు వేయడానికి అంగీకరించరు. ముస్లీం ఓట్లు తమ ఓటు బ్యాంక్ గా చేసుకున్న సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఏకమై ఒక్క తాటి మీదకు వస్తే, ముస్లీం వోట్లు పూర్తిగా ఆపక్షం వైపే పోతాయి. ఈ నేపథ్యంలో ముస్లీం ఓట్లలో చీలిక తెచ్చి కనీసం ఓ వర్గం, ముఖ్యంగా యువ తరం ఓట్లను ఆకట్టుకునేందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రత్యేక తంత్రం సిద్ధం చేస్తున్నది.

దేశ జనాభాలో ముస్లీంలు 13.5 శాతం ఉంటే, ఉత్తర ప్రదేశ్ లో ఏకంగా 18 శాతం మంది ఉన్నారు. హిందువుల తర్వాత అతి పెద్ద ఓట్ బ్యాంక్ ముస్లీంలదే. ముస్లీం ఓటర్లు సమైక్యంగా ఏకతాటిపై నిలిస్తే, 80 లోక్ సభ స్థానాలు కల ఉత్తర ప్రదేశ్ లో దాదాపు 30 స్థానాలు బీజేపీ చేయి జారుతాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీజేపీ విజయావకాశాలకూ దెబ్బే.

విభజించు పాలించు అని బ్రిటీష్ వాళ్లు నేర్పిన ఫార్ములా ఉందిగా అదే బాటలో నడిచి, ముస్లీం ఓట్లను కొంతైనా దక్కించుకునేందుకు బీజేపీ రచన సాగుతోంది.పార్లమెంటులో మెజారిటీ దక్కాలంటే.. ఏనుగు కుంభస్థలం కొట్టినట్లు అత్యధికంగా లోక్ సభ 80 సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో అధిక స్థానాలు గెలుచుకోవల్సిందే. 2014లో బీజేపీ మోడీ ప్రభంజనంలో 80 స్థానాల్లో ఏకంగా 73 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించింది. 2019లో ఆ స్థానాల సంఖ్య పెంచుకోక పోయినా, కనీసం అన్ని స్థానాలను దక్కించుకోవడమే ఆ పార్టీ లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ముస్లీం ఓట్లు గెలుపు తంత్రం ప్రయోగిస్తున్నది. ముస్లీంలలో పరస్పర వ్యతిరేక వర్గాలైన షీయా, సున్నీల మధ్య విబేధాలను తనకు అనుకూలంగా మరల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ట్రిపుల్ తలాఖ్ నిరోధక బిల్లు ద్వారా ముస్లీం మహిళలను ఆకట్టుకోవాలని యత్నిస్తోంది. ఈ మధ్య ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా ముస్లీంలు ఉండే అజంగఢ్, వారణాశిలలో నరేంద్ర మోడీ తన ప్రసంగాలలో కాంగ్రెస్ ముస్లీం పురుషుల పార్టీ అని విమర్శించడం ఈ వ్యూహంలో భాగమే.

ముస్లీం మహిళలు కరడు కట్టిన మత ఛాందస వాదుల కబంధ హస్తాల నుంచి బయట పడేందుకు చేపట్టిన ఉద్యమం నరేంద్ర మోడీని ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా ముస్లీం మత సంస్థలు, పార్టీలు ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇది ముస్లీంల మతపరమైన హక్కులలో జోక్యం అనే అంటున్నాయి. ముస్లీంలలో పురుషులు మూడు సార్లు తలాఖ్ చెప్పడం ద్వారా మహిళలకు సులభంగా విడాకులు ఇచ్చేస్తున్నారు. నిజానికి ఇస్లాం మతంలో తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం పెద్ద తతంగమే. ఒక సందర్భంలోనే మూడు సార్లు తలాఖ్ చెప్పడాన్ని పవిత్రగ్రంథం అంగీకరించదు. పాకిస్తాన్, సౌదీతో సహా దాదాపు 36 దేశాలు ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించాయి కూడా. కానీ, మతం కన్నా తామే పెద్దల మనుకునే మత నాయకులు మనదేశంలో విచ్చల విడిగా ట్రిపుల్ తలాక్ కు ఆమోద ముద్ర వేసేస్తున్నారు. దీంతో లక్షలాది మంది ముస్లీం మహిళలు సుఖంగా సాగుతున్న సంసారానికి దూరమై, బిడ్డలతో సహా రోడ్డున పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్లీం మహిళలు ఆత్మగౌరవం నినాదంతో ఉద్యమించారు.

 

ప్రధాని నరేంద్ర మోడీ ముస్లీం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని చక్క దిద్దాలని నడుం కట్టారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూల పరిస్థితులకు వీలు కల్పించింది. ఫలితంగా ట్రిపుల్ తలాఖ్ ను నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశించిన ముస్లీం మహిళల బిల్లు 2018. ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేక ముస్లీం మహిళల బిల్లును లోక్ సభ ఆమోదించినా, కాంగ్రెస్ మోకాలు అడ్డడంతో రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకించినా, లోక్ సభలో బిల్లు ఆమోదం పొం దినా సంపూర్ణ చట్టం రాకపోవడంతో ఇప్పటికీ ముస్లీంలు ట్రిపుల్ తలాఖ్ తో మహిళలకు విడాకులిస్తూనే ఉన్నారు. మహిళలు రోడ్డున పడుతూనే ఉన్నారు. అయితే నరేంద్ర మోడీ కృషితో ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేక బిల్లును చాలా మంది మహిళలు హర్షిస్తున్నారు. ఆ ముస్లీం మహిళలు మౌనంగా బీజేపీకి ఓటు వేస్తారనే భావన ఆ నాయకులలో ఉంది. 2017లో యూపీ ఎన్నికలలో ముస్లీం జనాభా దేవ్ బంద్ లో బీజేపీ విజయానికి కారణం మహిళా ఓటర్లే అని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ట్రిపుల్ తలాఖ్ బిల్లు నేపథ్యంలో చాలా మంది ముస్లీం మహిళలు 2019 ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ మహిళా మోర్చా ఖరాకండీగా చెబుతోంది.

అయితే ఘోషాకు పేరు పొందిన ముస్లీం మహిళలు మత నాయకుల ఫత్వాలను కాదని, మేధావుల హుకుంను తోసి రాజని హిందుత్వ పార్టీ బీజేపీకి ఓట్లు వేస్తారా అన్నది అనుమానమే. అయోధ్యలో రామ్ మందిరం నిర్మిస్తామని చెబుతున్న మాటలు ముస్లీం మహిళలకు ఆందోళన కలిగించి వారిలో అధికార పార్టీ వ్యతిరేకత పెంచే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల తరచు జరుగుతున్న హింసాకాండ, గో ఉద్యమం, అమానుషంగా మూకుమ్మడిదాడులు, హత్యలు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలు బీజేపీ ముస్లీం ఓట్ల తంత్రానికి తూట్లు పొడిచే ప్రమాదం లేకపోలేదు.

(*మల్యాల పళ్లం రాజు , సీనియర్ జర్నలిస్ట్,హైదరాబాద్ )