బిజెపి ‘బాహుబలి’ కి అంతసీన్ ఉందా ?

(మల్యాల పళ్లంరాజు)

 బిజెపి ‘బాహుబలి’ సూపర్ హిట్.. 2014లో.  ఆ తర్వాత చాలా కాలం  బాహుబలి నరేంద్రమోడీ సూపర్ హిట్ వోట్ కలెక్షన్ కింగే. ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాలలో తప్ప 2014 నుంచి ఉత్తరాదిన నరేంద్ర మోడీ ప్రభంజనానికి ఎదురు లేదు.. అయితే కర్ణాటక తప్ప దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో  బీజేపీ మహాబలిది ఫ్లాప్ షోనే.

  60వ దశకంలో జనసంఘ్, 70వ దశకంలో జనతాపార్టీ, 80వ దశకం నుంచి భారతీయ జనతా పార్టీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ, బలమైన శక్తిగా, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన దాఖలాలు లేవు.  ఇతర పార్టీలతో పొత్తు పుణ్యమా అని పోటీ చేసినా గెలిచిన స్థానాలు పట్టుమని పది లేవు. అలాంటి భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం తెలంగాణ లోనూ, 2019లో ఆంధ్రప్రదేశ్ లోనూ ఒంటరి పోరుకు, దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.  నరేంద్ర మోడీ హవాపై ఏకైక ఆశతో ఈ సాహసానికి దిగుతున్నా.. విజయం సాధిస్తుందని గ్యారంటీగా చెప్పే నాయకులు బీజేపీలోనే కరువయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983 వరకూ కాంగ్రెస్ పార్టీ ఎదురులేని పార్టీగా నిలిచింది. అప్పటి వరకూ సీపీఎం సీపీఐ వంటి పార్టీలు,  స్వతంత్ర పార్టీల వంటివి అక్కడక్కడ విజయం సాధించినా ఏ ఒక్క పార్టీ కూడా  బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ  చెందిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ప్రాంతీయ నాయకుల బలంతో కాంగ్రెస్ పార్టీ హయాంలో  ఉత్తరాది పార్టీ లేవీ కనీసం కాలు మోపే పరిస్థితి లేకపోయింది.1977లో దేశవ్యాప్తంగా జనతాపార్టీ ప్రభంజనం సృష్టించినా, తెలుగునాట వేళ్లూనుకోలేక పోయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీ రామారావు ప్రభంజనం, 1983లో అప్రతిహత విజయం తో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు తొలిసారి గట్టి దెబ్బ తగిలింది. గట్టి ప్రత్యామ్నాయం ఏర్పడింది. కాంగ్రెస్ కంచుకోటను ఛేదిస్తూ, 1983, 1985, 1994,1999లో  తెలుగుదేశం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ బలహీనం పడటం మరొక ప్రాంతీయ పార్టీకే ఉపకరించి తప్ప బిజెపి వంటి జాతీయ పార్టీలను తెలుగు వాళ్లు దరిదాపుల్లోకి రానీయలేదు. 1984 తర్వాత తెలుగుదేశానికి నాయకత్వం వహించిన చంద్ర బాబు కూడా బిజెపి ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచారు. తెలుగు పార్టీలు మతరాజకీయాలను దగ్గరకు రానీయలేదు. 

జండాలే తప్ప జనాలు లేరు

తెలంగాణ విషయానికి వస్తే, 1967లో దేశంలో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ యేతర పార్టీల ప్రభుత్వాలు ఏర్పడినా, తెలంగాణలో  జనసంఘ్ నుంచి కేవలం సి. జంగారెడ్డి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ఆవిర్భావం,1978లో కాంగ్రెస్ చీలిక, కాంగ్రెస్ ఐ తెలుగునాట సృష్టించిన ప్రభంజనంలో జనతాపార్టీ ఓ 15 సీట్లు నెగ్గింది. 1983లో తెలుగుదేశం హవాలో  బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ స్థానాలను పొందగలిగింది. 1985 నుంచి బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టింది. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీల కూటమి పుణ్యమా అని బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోగల్గింది. నాడు ఎన్టీఆర్ , నేడు చంద్రబాబు నాయుడు తోనూ భారతీయ జనతాపార్టీ జతకట్టినా వాళ్లు  తోకపార్టీగా మార్చేశారు.  సొంతంగా బలమైన శక్తిగా ఎదగకుండా చేశారు.  1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో బీజేపీ కాకినాడ తీర్మానం చేసినా, ఆ పార్టీకి కలిసి రాలేదు.

ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ బీజేపీ సొంతంగా పట్టుమని 25 సీట్లు గెలుచుకునే స్థితికి చేరలేదు.

2014లో  నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకోవడంతో  ఉభయ రాష్ట్రాలలో కలిపి మూడు పార్లమెంటు సీట్లు, కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలిగింది.

ప్రస్తుత రాజకీయాలకు వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక పక్క టీఆర్ ఎస్, మరో పక్క కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపీఐలతో కూడిన ప్రజాఫ్రంట్ తో గట్టి పోటీ ఎదుర్కొంటూ, తెలంగాణ అసెంబ్లీ లోని దాదాపు అన్ని స్థానాలకూ ఒంటరి పోటీ చేస్తున్నది. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నది.

 తెలంగాణలో భారతీయ జనతాపార్టీ అధినేత అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ పెద్దఎత్తునే ప్రచారం చేస్తున్నారు. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోదీ నిజామాబాద్‌, మహబూబ్ నగర్ లలో  ప్రచారం చేశారు. సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని.. సుమారు గంట పాటు తనదైన శైలిలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనను, టీఆర్ ఎస్ వైఖరినీ ఎండగట్టారు. అవినీతి, కుటుంబ పాలనపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు వస్తున్న నిధులన్నీ దిగమింగి, కేంద్రం సాయం లేకుండా తామే అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నట్లు టీఆర్ ఎస్  ప్రచారం చేసుకుంటున్నదని దుమ్మెత్తి పోశారు.

  నరేంద్ర మోడీ సభలకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు అనడం కన్నా తోలుకొచ్చారు అంటే నిజం చెప్పినట్లు అవుతుంది. ఎన్నికల సభలకు జనం స్వయంగా వచ్చే ఆనవాయితీ పోయింది.  ఏ పార్టీ ఎంత పెద్దఎత్తున జనసమీకరణ చేస్తే, ఆ సభ సక్సెస్. అది కేసీఆర్ సభ అయినా, కాంగ్రెస్ సభలైనా, రాహుల్, టీడీపీ సభలైనా అదే ఫార్ములా, జనాల్నిభారీగా ఖర్చుచేిసి తోలుకురావడమే. అందువల్ల ఈ సభలకు వచ్చిన జనం అంతా ఆయా పార్టీలకు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమే. ఏమైనా, తెలంగాణ ఎన్నికల సభలో  నరేంద్ర మోడీ మార్క్ ఎంతవరకూ కన్పిస్తుందన్నది అనుమానమే.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలు ఏర్పడి, నాలుగున్నర ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంతో అటు తెలుగుదేశం, ఇటు కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ  రాష్ట్ర సమితి బీజేపీ అన్నా, మోదీ అన్నా ఒంటి కాలుపై లేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపికి మిత్రులే లేరు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉన్నా, ఆ ప్రభుత్వ నుంచి ప్రయోజనాలున్నా, తెలంగాణలో కెసియార్ పాతబస్తీకే పరిమితమయిన ఎంఐఎం తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు తప్ప ప్రధాని మోదీని కలుపుకుపోవడం లేదు. ఇక ఆంధ్రలో  తెలుగుదేశం పార్టీ వదిలేశాక, బిజెపి తో ఒపెన్ గా  పొత్తు పెట్టుకునేందుకు వైసిపికి ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే, ఆంధ్రలో  ప్రధానిని అంతగా అన్ పాపులర్ అయ్యారు.  ప్రజలు బీజేపీ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాషాయం పార్టీకి ఒంటరి పోరు తప్పడం లేదు.  బీజేపీ అద్భుతమైన వ్యూహంతో, వినూత్న పంథాతో రంగంలోకి దిగితే తప్ప తెలుగునాట ఫ్లాప్ షో తప్పక పోవచ్చు. బిజెపిని మోదీ యే రక్షించలేకపోతే, ఇక కాపాడేదెవరు. అద్వానీ రథయాత్ర, రామమందిరం, గొప్ప రాజనీతిజ్ఞుయిన వాజ్ పేయి పర్సనాలిటీని కూడా లెక్కచేయకుండా తెలుగువాళ్లు బిజెపి దూరంగానే ఉంచారు. ఇది తెలుగువాళ్ల ప్రత్యేకం, లేదా దక్షిణ భారత ప్రత్యేకం అనుకోండి. ఈ రెండో ప్రయత్నంలో   కాషాయం బాహుబలి ఏమేరకు తెలుగునాట బీజేపీ జెండా రెపరెపలాడేలా చేస్తారో చూద్దాం. 

 

(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, 9705347795, ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)