ఆయన ఓ మంత్రి.! పైగా, జల వనరుల శాఖ మంత్రి.! ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల కారణంగా వరదల పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టుల్లోకి వచ్చిన, వస్తున్న, రాబోతున్న నీళ్ళ గురించి లెక్కలేసుకోవాలి. పరిస్థితిని అంచనా వేసుకోవాలి. సమీక్షలు జరపాలి.
కానీ, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుగారేమో, ‘బ్రో’ సినిమా వసూళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంతే కాదు, ‘బ్రో’ సినిమా ఫలితం గురించి కూడా అనాలసిస్ చేస్తున్నారు. అక్కడితో ఆగారా.? పవన్ కళ్యాణ్ మీద ఓ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో వున్నట్లు ప్రకటించారు.
వాస్తవానికి, ఇలాంటి విషయాల్ని జనానికి చూపించడానికి మీడియానే కొంత బాధ్యతగా వ్యవహరించి వుండాల్సింది. ఎందుకంటే, ప్రజలకు అస్సలేమాత్రం అవసరం లేని విషయమిది. గోదావరి నదికి వరద పోటెత్తింది.. అక్కడ కొన్ని చోట్ల సహాయక చర్యలు అవసరం. పోలవరం ప్రాజెక్టు సంబంధిత వ్యవహారాలూ ముఖ్యమంత్రి చూసుకోవాలి.
అబ్బే.. అలాంటివేవీ చేయడంలేదు మంత్రి అంబటి రాంబాబు. తనది జలవనరుల శాఖ.. అన్న విషయం మర్చిపోయి, సినిమా సంబంధిత శాఖ ఏదో అనుకుని భ్రమపడుతున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినా, సినిమా వసూళ్ళ గురించీ, సినిమా జయాపజయాల గురించీ మాట్లాడాల్సిన పనిలేదు.
వైసీపీలో చాలామంది నాయకులున్నారు. అధికార ప్రతినిథులూ వున్నారు. అలాంటివాళ్ళెవరైనా మాట్లాడితే అదో లెక్క. నిజానికి, అదే కరెక్టు. ఆ మాటకొస్తే, అది కూడా సరైన విషయమని చెప్పలేం. మంత్రిగారు మాట్లాడటం కంటే.. ఇతర నేతలు మాట్లాడితే కాస్త బెటర్ అంతే.
అంబటి రాంబాబు అసహనం కారణంగా, ‘బ్రో’ సినిమా పట్ల సింపతీ పెరుగుతోంది ఆడియన్స్లో. పరోక్షంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచి, జనసేన అధినేతకి సహకరిస్తున్నట్లుగా వుంది అంబటి రాంబాబు తీరు.