కుష్బూని కమిట్మెంట్ అడిగిన హీరో.. డేరింగ్ ఆన్సర్ ఇచ్చానంటూ నటి కామెంట్స్!

స్త్రీలు గడప దాటి అడుగు బయట పెడితే చాలు వాళ్ళని లైంగికంగా వేధించేందుకు సిద్ధంగా ఉంటారు పురుష ప్రబుద్ధులు. ప్రతి రంగంలోని ఇలాంటి లైంగిక వేధింపులు స్త్రీలు ఎదుర్కొంటూనే ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో స్త్రీలకు జరిగే అవమానాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అవకాశాలు ఇస్తామని కొందరు, డబ్బు ఎరచూపి ఇంకొందరు, హీరోయిన్స్ చేస్తానని మరికొందరు వాళ్ల దగ్గర కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి వేధింపులు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నా నాటితరం హీరోయిన్లు అంత త్వరగా బయటపడేవారు కాదు.

కానీ నేటి తరం హీరోయిన్స్ ఎవరికీ భయపడటం లేదు. ఎవరైనా తమ వద్ద తప్పుగా ప్రవర్తిస్తే సోషల్ మీడియా వేదికగా వారి తాటతీస్తున్నారు. సోషల్ మీడియాలో అలా రచ్చ జరిగిన ప్రతిసారి గత తరం హీరోయిన్లు తాము కూడా ఎదుర్కొన్న లైంగిక సంఘటనల గురించి చెప్పుకొస్తున్నారు. సీనియర్ నటి కుష్బూ కూడా గతంలో తనకి జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం గోవాలో 2024 ఇఫీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా కుష్బూ లైంగిక వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రతి చోటా జరుగుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇలా వేధింపులకు గురైనదాన్నే, ఒకానొక సమయంలో నేను ఒక సినిమా షూటింగ్ లో ఉండగా ఒక హీరో దగ్గరికి వచ్చి వెటకారంగా నవ్వుతూ ఏంటి మేడం మాకు ఛాన్స్ ఏమైనా ఉందా అని అసభ్యకరంగా అడిగాడు.

అయితే నేను ఊరుకోకుండా నా చెప్పు సైజు 41.. చంప పగలగొట్టమంటావా అని అందరి ముందు వార్నింగ్ ఇవ్వటంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుష్బూ లాంటి ఫైర్ బ్రాండ్ నే కమిట్మెంట్ అడిగిన హీరో ఎవరా అంటూ ఆరాలు తీస్తున్నారు. ఏది ఏమైనా కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది స్త్రీలకి ఎంతో అవసరం.