ఏపీ టీడీపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ పురందేశ్వరి.. ఏపీసర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని అదేపనిగా పురందేశ్వరి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు నిర్మలాసీతారామన్ ని కూడా కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సమయంలో పార్లమెంటులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఏపీలో అప్పుల వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రంపై ఉందని తెలిపారు. 2023 నాటికి అంటే వైసీపీ నాలుగేళ్ల పాలన తర్వాత రూ.4.41 లక్షలకు చేరిందని నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనలో మొత్తం మీద రూ.1.77 లక్షల కోట్లు అప్పుల భారం పడిందని చెప్పారు. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తున్నా.. కోవిడ్ లాంటి ఇబ్బందుల్లో కూడా ఏ పథకమూ ఆపకుండా కొనసాగించినా.. చంద్రబాబు కంటే జగన్ సర్కార్ తక్కువ అప్పులే చేసిందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారన్నమాట. ఇలా స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి, బీజేపీ నేత పార్లమెంటు లో ప్రకటించినా కూడా… పురందేశ్వరి ఏపీ సర్కార్ పై విమర్శలు ఆపలేదు.
ఈ నేపథ్యంలో పురందేశ్వరి విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా విమర్శలు చేస్తున్న సాయిరెడ్డి .. తాజాగా అప్పులపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఇప్పటికే… ఒక పార్టీలో ఉంటూ మరోపార్టీ కోసం పనిచేస్తున్నారంటూ సెటైర్ వేసిన ఆయన… మరోమారు దాదాపు అలాంటి వెర్షనే వినిపించారు.
“పార్లమెంటులో స్వయంగా ఆర్ధికమంత్రే ప్రకటించినా పట్టించుకోకుండా ఏవో కాకిలెక్కలు చెబుతోంది చెల్లమ్మ పురంధేశ్వరి. నాలుగేళ్లలో ఒక్కపరిశ్రమా రాలేదంటూ గాలిమాటలెందుకు? ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారీ రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. బావ కళ్లల్లో ఆనందం కోసం కాదమ్మా… ఉన్నపార్టీ కోసం పనిచేయొచ్చుగా!” అంటూ ట్విట్టర్ లో స్పందించారు సాయిరెడ్డి.
ఇదే సమయంలో “బీజేపీ, టీడీపీ వేర్వేరు పార్టీలే. అధికారం కోసం రెండు పార్టీలూ సొంత సిద్ధాంతాలతో పోరాడాలి. కానీ ఇక్కడ “బావ”సారూప్యత అనే చిక్కుసమస్య వచ్చిపడింది. పొత్తు ఏదీ లేకున్నా “బావ”గారిచ్చే స్క్రిప్టునే బీజేపీ అధ్యక్షురాలు ఫాలో అవుతున్నారు. కాకపోతే 10లక్షల కోట్ల రుణం దుష్ప్రచారాన్ని నమ్మడానికి జనం సిద్ధంగా లేరు” అని మరో ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో.. పురంధేశ్వరి పరోక్షంగా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేస్తున్నట్లున్నారని అంటున్నారు.