తెలుగు రాజకీయాల్లో బడాయి కబుర్లు బాగా ఎక్కువగా ఎవరు చెబుతారంటే ఠక్కున వినిపించే పేరు… చంద్రబాబు నాయుడు.. అని గతానుభవం గుర్తున్న అధికశాతం ప్రజలు ఒప్పుకుంటుంటారు. కంప్యూటర్ కనిపెట్టడం, సెల్ ఫోన్ తీసుకురావడం, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తానని చెప్పడం, తాను అధికారంలో ఉండి ఉంటే కరోనా వచ్చేది కాదని పలకడం, కరోనా వ్యాధికి వ్యాక్సిన్ తన పాలన ఫలితమే అనడం.. ఇక అమరావతి నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చూపించిన సమయంలో… సింగపూర్, మలేషియా మొదలైన దేశాల పేర్లు చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో… చంద్రబాబే కాదు.. తానుకూడా అంతకుమించి చెప్పగలను అంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు!
మొదట్లో బాబుతో కలిసి పనిచేసిన అనుభవ ఫలితమో.. లేక, మరేదైనా కారణమో తెలియదు కానీ… బాబుకు ఏమాత్రం తగ్గకుండా సంచలన వ్యాఖ్యలు.. కాదు కాదు.. బడాయి కబుర్లు చెప్పుకొచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. అవును… తాజాగా మైకందుకున్న ఆయన… “అమెరికాకు ధీటుగా నేడు తెలంగాణలో అభివృద్ది జరుగుతోంది” అని అన్నారు! దీంతో… తీవ్రంగా ఉన్న ఎండలకు తోడు ఈ మాటలు కూడా వినిపించడంతో మరింత మంటెక్కిపోతున్నారు విపక్ష నేతలు!
ఒకవైపు తెలంగాణలో సమస్యలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఊర్లలో నీళ్లు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. తెలంగాణ ఆసుపత్రుల్లో స్టెచ్చర్స్ లేక కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కడుపులో క్లాత్ పెట్టి కుట్టేసే ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర దొరక్క అల్లల్లాడిపోతున్న రైతులు, జీతాలు సమయానికి రాక విసిగిపోతున్న ఉద్యోగులు, వర్షాకాలం వస్తే మడుగులను తలపించే రోడ్లు, కాల్వలను తలపించే కాలనీలు… ఇలా మచ్చుకు కొన్నైనా కళ్లకు కనిపిస్తే… తుమ్మళ అంత మాటనే ధైర్యం చేసేవారు కాదు!
కాగా… తాజాగా మీడియా ముందుకువచ్చిన తుమ్మల… కేసీఆర్ ను మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. గోదావరి జలాలు త్వరలోనే సత్తుపల్లికి రాబోతున్నాయని.. ఎన్నికల ముందే గోదావరి జలాలతో సత్తుపల్లి రైతుల కాళ్ళు కడుగుతానని చెబుతున్నారు!