రేణు దేశాయ్ లేటేస్ట్ పోస్ట్… ఒక రేంజ్ లో పవన్ పై ప్రశ్నలు!

అభిమానుల విషయంలో పవన్ అభిమానులు వేరయా అంటుంటారు సినీజనాలు. పవన్ కి బలం, బలహీనత రెండూ అభిమానులే అనేవారూ లేకపోలేదు. కాకపోతే… పవన్ ఇప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. ఒక రాజకీయపార్టీకి అధినేత, రాబోయే కాలంలో కాబోయే సీఎం అవ్వాలని కలలుగంటున్న నేత! మరి అలాంటి వ్యక్తికి అభిమానులుగా ఉన్నవారు ఎంత హుందాగా ప్రవర్తించాలి? తమ ప్రవర్తన ద్వారా తమ నాయకుడికి ఎంత గౌరవం తెప్పించాలి? అది లేదు సరికదా… ఆన్ లైన్ వేదికగా తమ నాయకుడి, తమ అభిమాన నటుడి పరువును గంగలో కలిపేస్తున్నారు. ఆయన్ను అభిమానించే కాస్త మెచ్యూరిటీ ఉన్న జనాలను పునరాలోచనలో పాడేస్తున్నారు.

అవును… ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి విడాకులు తీసుకోని త‌న బ్రతుకేదో తాను బ‌తుకుతుంటే.. అప్పుడ‌ప్పుడు కొంత మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ను ఆన్ లైన్ వేదికగా ఇబ్బందుల‌కు గురిచేస్తునే ఉంటారు. త‌నను రెచ్చగొట్టి.. రేణుతో ప‌వ‌న్ పరువు తీస్తుంటారు. ఇందులో భాగంగా… రెండు రోజులు క్రితం మొద‌లైన ప‌వ‌న్ అభిమానులు వ‌ర్సెస్ రేణు దేశాయ్ ర‌చ్చ తాజాగా కీలక మలుపు తీసుకుంది. తాజాగా ఓ నెటిజన్ త‌న‌కు పంపిన మేసేజ్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ప‌వ‌న్ అభిమానుల‌కు రేణు ఊహించని కౌంట‌ర్ ఇచ్చారు. రేణూ దేశాయ్ షేర్ చేసిన.. ఒక నెటిజన్ పంపిన మెసేజ్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం!

“రేణూ మీరు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్. మీయొక్క మానసిక పరిస్థితిని ఎంతగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నారనేది నాకు అర్ధం కావడం లేదు. పవన్‌ తో మీరు విడిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయినా జనాలు ఇంకా చెత్త వాగుడు మాట్లాడుతున్నా కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. మీరు మరింత స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా నాకు ఒకటి అర్థం కాదు.. మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోళ్లు మూయించడానికి పీకే ఒక్క స్టేట్‌మెంట్‌ అయినా ఎందుకు ఇవ్వరు?.. రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పే పవన్‌.. తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? మీలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అన్నది మీ వ్యక్తిగత విషయం. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటేనే పట్టించుకోని పీకే రాష్ట్ర ప్రజలందరి గురించి ఎలా చూసుకుంటాడు? మీకోసం ఒక్క స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ ను ఆపడానికి ఆయనకు ఏం అడ్డు వస్తుందో అర్థం కావడం లేదు” అంటూ మెసేజ్ చేశారు నెటిజన్.

దీంతో… ఆ నెటిజ‌న్ కామెంట్ కు రిప్లై ఇచ్చిన రేణూ దేశాయ్… “మీలాగే ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతారు. కానీ వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా పరిధిలో లేని విషయాల గురించి నేనేం చెప్పను?” అంటూ బదులిచ్చారు. దీంతో… రేణూ దేశాయ్ ఇచ్చిన సమాధానం సంగతి కంటే… ఆమెను పవన్ గురించి అడిగిన నెటిజన్ ప్రశ్న ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.

కాగా రెండు రోజుల క్రితం అకీరాను.. “మా అన్న కొడుకు” అని పవన్‌ ఫ్యాన్స్‌ సంబోధించడంతో రేణు దేశాయ్‌ ఫైర్‌ అయ్యింది. “మీ అన్న కొడుకా?.. అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి” అని కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.