ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లుగా మారిపోతున్నట్లుంది టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని.. కానిపక్షంలో మనుగడ ప్రశ్నార్ధకం అయిపోద్దని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో… టీడీపీ – జనసేనలు తమ పొత్తులోకి బీజేపీని కూడా ఆహ్వానించి 2014 తరహాలో బరిలోకి దిగుతున్నాయి. ఫలితాలు కూడా ఆ విధంగా వస్తాయని ఆశిస్తున్నాయి!
ఈ క్రమంలో 144 సీట్లలో టీడీపీ, 21 సీట్లలో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీచేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబు ముందుగా 94మంది అభ్యర్థులను ప్రకటించగా.. పవన్ కల్యాణ్ 5 స్థానాల్లో అభ్యర్థులను తొలివిడతగా విడుదల చేశారు. అప్పటివరకూ పెద్దగా సమస్యలు లేవు కానీ… చంద్రబాబు ఎప్పుడైతే రెండో విడత అభ్యర్థులను ప్రకటించారో.. పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారో అప్పుడు మొదలైంది.
అవును… టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా వెలువడగానే టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. సుమారు ఐదారుగురు మంత్రులకు టిక్కెట్లు ప్రకటించకపోవడంతోపాటు.. ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతల పేర్లు కూడా రెండో జాబితాలో లేకపోవడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇందులో భగంగా పెనమలూరులో బోడె ప్రసాద్ అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాస్ వర్గం సెకండ్ థాట్ కి వెళ్లిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే క్రమంలో… బండారు సత్యనారాయణ మూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహార్, దేవినేని ఉమ, ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్ ల పేర్లు కనిపించకపోవడంతో ఆయా వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇదే సమయంలో ప్రధానంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ అన్నతర్వాత… అక్కడ మంటలు భారీ ఎత్తున చెలరేగాయి.
చంద్రబాబు, లోకేష్ ల ఫ్లెక్సీలు, పోస్టర్లు చింపిన కార్యకర్తలు.. బూతూలు తిడుతూ, పవన్ కు శాపనార్థాలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. పైగా పిఠాపురంలో వర్మ బలమైన నేత కావడంతోపాటు.. 2014లో ఇలాగే చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మ సొంతం. దీంతో… ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కు శాపంగా మారేలా ఉందనే చర్చ మొదలైంది.
దీంతో… పొత్తులో భాగంగా ఒక పార్టీ అధినేత పోటీ చేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే… మిగిలిన 20స్థానాల్లో జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనే చర్చా తెరపైకి వచ్చింది. ముందునుంచీ ఒక వర్గం కాపు సామాజికవర్గం ఆందోళన చెందుతున్నట్లు… జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వడం సంగతి అలా ఉంచితే… ఉన్న 21 స్థానాల్లోనూ టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ ఫర్ అవుతాయా అనే సందేహాలకు బలం వచ్చినట్లయ్యింది.
ఇక టీడీపీ రెండో జాబితా అనంతరం బీజేపీలో కూడా రచ్చ మొదలైంది. ఇప్పటికే అసలు సిసలు బీజేపీ నేతలను పక్కనపెట్టి… చంద్రబాబు సిఫార్స్ చేసినవారికి, వలస పక్షులకు టిక్కెట్లు ఇస్తున్నారంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న దశలో… ఓడిపోయే సీట్లనే బీజేపీకి కేటాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో… ఈ విషయంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇలా టీడీపీ రెండో విడత జాబితా బయటకు రాగానే… మూడు పార్టీల్లోనూ అసంతృప్తతతో పాటు చంద్రబాబు అతి తెలివి తెరపైకి వచ్చిందని అటు జనసేన, బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. దీంతో… కూటమిలో ఏర్పడిన కుంపటి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది వేచి చూడాలి.