పవన్ తన వారాహి రెండోదశ యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు రెండువారలకు పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి వారాహి రెండోదశ యాత్ర మొదలుకాబోతోంది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పవన్ కు రెండు రివక్స్టులు చేస్తున్నారు జనసైనికులు. వాటిలో ఒకటి రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మొదటి అంశం కాగా… ఈ సారి ఎన్ని సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు.. అవి ఏమి అని!
టీడీపీతో పొత్తు విషయంలో జనసైనికులు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా… టీడీపీతో పొత్తుతోనే ఈ సారి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తారనేది జనసనికులు బలంగా నమ్ముతున్నారు. ఒంటరిగా వెళ్తే వీరమరణమని అధినేతే ఆందోళన చెందుతున్న సమయంలో.. జనసైనికులు కూడా కాంప్రమైజ్ అయిపోయారు.
ఈ సమయంలో పవన్ తాను ఎక్కడనుంచి పోటీ చేసే విషయం ఈ దఫా యాత్రలో చెప్పాలని రిక్వస్టులు చెస్తున్నారు జనసైనికులు. ఫలితంగా ఇప్పటినుంచే ప్రచార కార్యక్రమాలు, కమిటీల ఏర్పాట్లూ చేసుకుంటామని చెబుతున్నారని సమాచారం.
కారణం… గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల తమ అధినేత ఓటమిపాలవ్వడాని జీర్ణించుకోలేని జనసైనికులు ఈసారి ముందుగా తమ నేత ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం తెలిస్తే ఆయన గెలుపు కోసం అహర్నిశలు పని చేస్తామంటూ శపథాలు చేస్తున్నారని తెలుస్తుంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన దాదాపుగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో… ఈసారి ఒక స్థానం నుండే పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని.. రెండు చోట్ల చేయకపోవచ్చని అంటున్నారు. సో… ఆ ఒక్కచోటు ఎక్కడ నుంచి అనేది ముందే తమకు క్లారిటీ ఇవ్వాలని జనసైనికులు కోరుతున్నారు.
ఇక ఈసారి ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంలో స్పష్టత కోరుతున్నారు జనసైనికులు. ఫలితంగా కేవలం ఆ నియోజకవర్గాలపైనే పూర్తి శ్రద్ధపెట్టి జనసేన గెలుపుకు సహకరించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం అమృతం అనే సంగతి పవన్ కల్యాణ్ మరిచిపోకూడదని వారు సూచిస్తున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
మరి వారాహి రెండోవిడత యాత్రలో అయినా పవన్ కల్యాన్ తాను పోటీ చేసేది ఎక్కడనుంచి అనే విషయంలో స్పష్టత ఇస్తారా.. లేక, ఇంకా ఒక క్లారిటీకి రాలేదు, ఎక్కడనుంచి పోటీ అనే విషయంలో అనుమతి రాలేదంటూ ఈసారి కూడా దాటవేసే ధోరణిలోనే ముందుకుపోతారా అనంది వేచి చూడాలి.
కాగా, వారాహి మొదటి విడత యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేయబోతున్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కూడా ఆ స్థాయిలోనే అక్కడి స్థానిక నేతలతోనూ, జనసైనికులతోనూ ఇలానే మాట్లాడారని అంటున్నారు. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఫైట్ అనంతరం ఆ ఆలోచన విరమించుకున్నట్లు ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.