వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ రెండు చెంపలూ వాయించారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై ఫిర్యాదు చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతికి బయలుదేరారు.
ఈ విషయంలో… శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిని కొట్టారని జనసేన నేతలు అరోపిస్తుంటే… కొట్టడానికి కారణాలు తెలిస్తే అలా మాట్లాడరని, కొట్టినట్లు కనిపిస్తున్న వీడియోకు ముందు ఏమి జరిగిందో తెలిస్తే నోరు ఎత్తరని అంజూ యాదవ్ తరుపున అక్కడున్న కొంతమంది పోలీసులు చెబుతున్నారని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… అంజూ యాదవ్ కు అధికారులు చార్జ్ మెమో ఇచ్చారు. అక్కడితో సరిపోదని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనసేన నాయకులు. ఇందులో భాగంగానే స్వయంగా పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని మరింత హైలెట్ చేసేందుకు తిరుపతి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే ఆన్ లైన్ వేదికగా ప్రకటించారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా తరలి రావాలని సూచించారు. ఈ సందర్భంగా… పవన్ నేరుగా జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేస్తానంటున్నారు.
ఆ సంగతులు అలా ఉంటే… తిరుపతికి పవన్ వెళ్తోన్న వేళ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగుతాయో అనే ఆందోళనలో పోలీసులు ఉన్నారని అంటున్నారు. పవన్ తిరుపతి పర్యటన అంటే పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.
వాలంటీర్లు ఇప్పటికే పవన్ పై పీకల్లోతు కోపంతో ఉన్నారు, జగ్గూ భాయ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. కొత్తగా బీసీ నాయకులు తెరపైకి వచ్చారు… అంజూ యాదవ్ కి సపోర్ట్ గా వస్తున్నారు. మరోపక్క జనసైనికులు పవన్ పర్యటన విజయవంతం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది.