ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ తన సొంత కార్యక్రమంగా నిర్వహించుకున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకలే హాట్ టాపిక్! ఈ కార్యక్రమంపై ఆత్మవంచన చేసుకున్న కొందరు ప్రశంసించగా.. మరికొందరు ఇది మోడీ సొంత కార్యక్రమం కాదంటూ పెదవి విరిచారు.. రాష్ట్రపతికి జరిగిన అవమానంపై ఆవేదన చెందారు. ఇది ప్రజాస్వామ్యం అనే విషయం మోడీకి గుర్తు చేయడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు! ఈ సమయంలో ఈ కార్యక్రమంపై పవన్ కల్యాణ్ స్పందించారు!
కొత్తగా ప్రారంభించిన పార్లమెంటు భవన వేడుకలకు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇక ఎంపీలను పిలిచినా.. కేవలం మోడీ ప్రసంగాన్ని వినేందుకు మాత్రమే వారిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేశారు. ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే… బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందలేదు. అయితే తనకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందుతుందని ఆఖరి క్షణం వరకు వేచి చూసి నిరాశ చెందిన పవన్… ఈ విషయంపై ఆచితూచి స్పందించారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం పురస్కరించుకుని ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం.. భరతమాతకు మరో మణిహారమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాస్త జగన్ అభిప్రాయంతో ఏకీభవించిన పవన్… పరోక్షంగా మోడీకి సెటైర్ వేసి వెయ్యనట్లు వేశారు. దీంతో… పవన్, మోడీ విషయంలో లోపల గుస్స్గాగానే ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు.
“ఈరోజు భారతదేశానికి ఒక మైలురాయి.. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించిన పార్లమెంట్ ప్రారంభించబడింది. ఈ శుభ సందర్భానికి మన రాజకీయ వ్యవస్థ అంతా ఏకం కాకపోవడం దురదృష్టకరం. నేటి కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించడం బాధాకరం” అని అన్నారు. దీంతో… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తన ట్విట్టర్ లో చెప్పింది ఇదే కదా అని రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు.
అనంతరం… “పార్లమెంటు మన సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఇది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు! అది తమ ప్రతినిధులను పంపే భారత ప్రజలకు చెందినది. పార్లమెంటు అనేది ఒక పవిత్రమైన సంస్థ, దాని పవిత్రత మన రాజకీయ సిద్ధాంతాలు, విభేదాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ గౌరవించబడాలి” అని ట్వీటారు పవన్. అయితే ఈ ట్వీట్ లో “పార్లమెంట్ అనేది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు” అనే లైన్ లో.. ఈ కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా.. బీజేపీ ఫంక్షన్ గా చేసిన మోడీకి సున్నితంగా చురకలు అంటించారని అంటున్నారు పరిశీలకులు.