ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే “సిద్ధం” అంటూ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ ఎత్తున సభలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భీమిలిలో ఒక సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన జనసందోహం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉందని అంటున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో భీమిలిలో సభా ప్రాంగణం కిటకిటలాడిపోయింది. దీంతో… “సిద్ధం” ఎంట్రీ పీక్స్ అనే కామెంట్లు వినిపించాయి.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు “రా.. కదలిరా” అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఈ సభలు టీడీపీ కేడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా చేపట్టేసి.. వారిని బలపరుస్తూ మీటింగ్స్ పెడితే బాగుంటుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!! కారణం… పొత్తులో ఉండటం వల్ల!!
ఇదే క్రమంలో… ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిళ రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పార్టీని పరిస్థితిని సమీక్షిస్తూ.. ఇంతకాలం స్థబ్ధగా ఉన్న నేతల్లోనూ, ఉన్న కేడర్ లోనూ కదలికలు తీసుకొచ్చే ప్రయ్తన్మ్ చేస్తున్నారు. ఏది ఏమైనా… వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏపీ కాంగ్రెస్ లో కాస్త కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని జనసైనికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కూడా ఎన్నికల శంఖారావం పూర్తించనున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని.. ఆ రోజు భారీగా చేరికలు కూడా ఉంటాయని.. అక్కడ నుంచి ఇక అవిరామంగా ప్రచార కార్యక్రమాలు ఉంటాయని అంటున్నారు.
ఇందులో భాగంగా… ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారని.. ఈమేరకు తొలిసభను ఫిబ్రవరి 4న అనకాపల్లిలో ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఆ విధంగా ఉత్తరాంధ్రలో ఆ సభ అయిన తర్వాత డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో రెండోసభ, మచిలీపట్నంలో మూడోసభ, తెనాలిలో నాలుగోసభ, తిరుపతిలో ఐదోసభ ఉంటుందని తెలుస్తుంది.
ఈ క్రమంలో ముందుగా ఫిబ్రవరి 4న ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జరగబోయే మొదటి బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9 లేదా 10న అమలాపురంలోనూ భారీ బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.