జనసేన ఆశించినన్ని టిక్కెట్లు ఇవ్వడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ససేమిరా ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ఓకే చెప్పినా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయం వేరేలా వుంటుంది.
తండ్రిని కాదని నారా లోకేష్, తెలివితేటలు ప్రదర్శించే పరిస్థితి లేదు. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో లోకేష్ చుట్టూ వున్న టీమ్ వ్యవహరిస్తున్న తీరు వేరు. ఇది కమ్మ – కాపు పంచాయితీ.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు వ్యూహం. ఆయనెప్పుడూ ఇలాంటి వ్యూహాలే రచిస్తుంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేసినా, వామపక్షాల్ని వెంటేసుకున్నా.. ఇప్పుడు జనసేనను వాటేసుకుంటున్నా.. చంద్రబాబు వ్యూహాలు అలాగే వుంటాయ్.
జనసేనకు 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదని భీష్మించుక్కూర్చుంది లోకేష్ టీమ్. అయితే, ఈ వ్యవహారంలో లోకేష్ పేరు తెరపైకి రాకుండా చంద్రబాబు నానా తంటాలూ పడుతున్నారు. ప్రభుత్వంలోనూ జనసేనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకూడదనుకుంటోంది లోకేష్ టీమ్.
ఎన్నికల ముందర ఏదో ఒకటి చెప్పి, ఎన్నికలయ్యాక అసలు వెన్నుపోటు డ్రామా ఆడొచ్చని చంద్రబాబు చూస్తున్నారట. అడిగిన 75 సీట్లు అవసరమైతే ఇచ్చేద్దామనీ, ఎన్నికలయ్యాక చూసుకుందామనీ లోకేష్‌ని చంద్రబాబు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
75 సీట్లు ఇస్తే, ఇరు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ఫర్ బాధ్యత కూడా పూర్తిగా టీడీపీదే అవుతుందనీ, ఆయా నియోజకవర్గాల్లో ఖర్చు కూడా టీడీపీదే అవుతుందనీ లోకేష్ లెక్కలేసుకుంటున్నారు. లోకేష్ వాదనలోనూ నిజం లేకపోలేదు.
కానీ, ఓ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకి అవసరమయ్యే ఓ పదివేల ఓట్లు జనసేన నుంచి టీడీపీకి రావాలంటే.. కొన్ని త్యాగాలు తప్పవు. ఇదే విషయాన్ని లోకేష్‌కి చంద్రబాబు చెప్పి బుజ్జగిస్తున్నారట.