Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర స్థాయిలో పోలీసులు తీరుపై మండిపడ్డారు. వైకుంఠ ద్వారదర్శన టికెట్లకు సంబంధించిన టోకెన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఒకసారిగా గేట్లు ఓపెన్ చేయటంతో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా 6 మంది చనిపోగా 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు .ప్రస్తుతం వీరందరూ తిరుపతి రుయా , స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఈ ఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వ నేతలు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇతర మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తిరుపతి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోలీసు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన జరగడానికి టీటీడీ అధికారుల తప్పు ఎంతైతే ఉందో పోలీసులది కూడా అంతే పాత్ర ఉందని తెలిపారు. కొంతమంది పోలీసులు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపారు..
తన ప్రెస్‌మీట్ వేళ కూడా సరిగా వ్యవహరించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న పవన్ కల్యాణ్.. వందల మంది పోలీసులున్నా తొక్కిసలాట ఎలా జరిగిందన్నారు. పోలీసుల నిర్లక్ష్యం పై తాను సీఎం వద్ద కూడా ప్రస్తావన చేస్తానని తెలిపారు.పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్‌మెంట్ రావట్లేదన్న పవన్ కల్యాణ్.. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగిందని నిలదీశారు. ఏదైనా ఒక ఘటన జరిగితే ఎలా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఇలా ఈ ఘటనలో భాగంగా పోలీసులను కూడా తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ పోలీసు తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పోలీస్ వ్యవస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని ఇలాగైతే తానే హోమ్ మినిస్టర్ గా చార్జ్ తీసుకుంటాననీ పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది పవన్ ప్రతిసారి పోలీసులను టార్గెట్ చేయడం వెనుక అసలు ప్లాన్ ఏంటి అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.