ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు… హీరో – విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు ఇప్పుడూ ఏపీలో జనసేన అధినేత పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకి 188 కోట్లకు సంబంధించి ఇన్ కం టాక్స్ నోటీసులు ఇవ్వడం ఏమిటి.. వైసీపీ వాళ్లు తీవ్ర విమర్శలు చేయడం ఏమిటి.. మధ్యలో పవన్ ఉక్కిరిబిక్కిరి అయిపోవడం ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్లు చెప్పుకున్న పవన్ కల్యాణ్… చంద్రబాబుని తప్ప అందరినీ ప్రశ్నిస్తారనే కామెంట్ పొలిటికల్ సర్కిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ ప్రశ్నిస్తే యజమాని ఊరుకుంటాడా… అంటూ జనసేనకు చంద్రబాబే బాస్ అన్నట్లు వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా ఈ విషయంపై జనసేన అధినేత స్పందించడం లేదు.
ఈ సమయంలో తాజాగా జరిగిన ఒక టీవీ డిబేట్ లో జనసేన నేతలు ప్రవచనాల టైపులో వాదిస్తుండటం గమనార్హం. ఇది క్రిమినల్ కేసు కాదు కాబట్టి తాము మాట్లాడటం లేదని, ఆర్థిక నేరం కాబట్టి ఇందులో స్పందించడానికి ఏముందని చెప్పుకొస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి తమను లాగుతున్నారేంటని చెప్పుకున్నారు. దీంతో… విచారణలో ఉన్న వివేకా కేసులో… అవినాష్ పై అవాకులూ చెవాకులూ పేలినప్పుడు ఈ జ్ఞానం ఏమైంది అనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురైంది.
దీంతో నీళ్లు నమిలినట్లు కనిపించిన జనసేన అధినేత… ఇది వేరు, అది వేరు అని సమర్ధించుకుంటూ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు! అంతేతప్ప చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదనో.. లేక, ఆ నోటీసులను ఖండిస్తున్నామనో చెప్పే సాహసం మాత్రం చేయలేకపోవడం గమనార్హం.
దీంతో జనసేనలో కీలక నేతలుగా ఉన్న, వాక్ చాతుర్యం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే పవన్ కల్యాణ్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం. దీంతో… జనసేన నేతల కష్టాలు, పవన్ ఇబ్బందులు పగోడికి కూడా రాకూడదని అంటున్నారు నెటిజన్లు!