అసత్యాలు చెప్పొచ్చు కానీ అందులో కూడా ఎంతో కొంత పద్దతి ఉండాలని అంటుంటారు. ఆ అబద్ధం కూడా గోడకట్టినట్లు ఉండాలి కానీ… తడికలు అడ్డుపెట్టినట్లు కాదని చెబుతుంటారు. అయితే అబద్దాలందు బీజేపీ నాయకులు చెప్పే అబద్ధాలు వేరయా అన్నట్లుగా ఉంది పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నింటినీ.. ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసేసిందని పార్లమెంటులో హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. ఈ ఒక్క మాటసరిపోదా… అబద్దాల విషయంలో మోడీ సర్కార్ ని మించినోడు మరొకడుంటాడా అనే సందేహం రావడానికి?
ఎంత నిసిగ్గుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ప్రకటించుకుందో అర్థంకావటంలేదు కానీ… విభజన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందని ఒకవైపు జనాలంతా మండిపోతుంటే… ఇలా మోడీ సార్కార్ మాత్రం పూర్తి నిస్సిగ్గుగా అన్నింటినీ అమలు చేసినట్లు ప్రకటించేసుకోవటం దారుణం అని అంటున్నారు పరిశీలకులు.
అయితే ఈ విషయాలపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం… కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీ విషయంలో చెప్పింది చిన్న అబద్ధం కాదు. ఎంతో బరితెగించేస్తే తప్ప ఆ స్థాయి మాటలు రావాని, అంత నిస్సిగ్గుగా చెప్పలేరని అంటున్నారు పరిశీలకులు.
కారణం… అప్పటి విభజన హామీల్లో ప్రధానమైనవి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, పోలవరంను జాతీయప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే నిర్మించటం, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు భర్తీ చేయటం లాంటివి ఎప్పుడు నెరవేరాయో.. ఎలా నెరవేరాయో మోడీకే తెలియాలి!
నరేంద్ర మోడీ ప్రధాని కాగానే హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. విశాఖ రైల్వేజోన్ కుదరదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యంకాదని చెప్పేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులను రెండేళ్ళిచ్చి తర్వాత ఆపేసింది. చంద్రబాబుతో కలిసి పోలవరానికి వెన్నుపోటు పొడిచారు. ఇవన్నీ మోడీ దృష్టిలో హామీలన్నీ నెరవేర్చేసినట్లో ఏమో వారికే తెలియాలి.
పోలవరం ప్రస్థావన వచ్చిన ప్రతీసారీ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ప్రజలకు పొడిచిన వెన్నుపోటు గురించి ప్రత్యేకంగా ప్రస్థావించుకొవాలి. అవును… పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దుస్థితిలో ఉందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబునాయుడే అనేది నిర్వివాదాంశం.
జాతీయ ప్రాజెక్టుగా మారిన పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయంలో మోడీకి చంద్రబాబుకీ కురిదిన లోపాయకారీ ఒప్పందం ఏమిటనేది తెలియదు కానీ… అలా ఎందుకు తీసుకున్నారో అందరికీ తెలిసిందే అనేది విశ్లేషకుల మాట. ఇలా ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టేశారని అంటుంటారు.
ఇలా చంద్రబాబు చేతకానితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న మోడీ… విభజన హామీలను తుంగలో తొక్కేశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఏపీకి కాకుండా చేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీకి ఇంత అన్యాయం చేసిన మొడీ సర్కార్… ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్చేసినట్లు అంత నిస్సిగ్గుగా ప్రకటించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.