ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ ను ఏ-14గా చేర్చుతూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నారు. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతోపాటు.. 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లారని తెలుస్తుంది.
అయితే ఢిల్లీలో లోకేష్ కు నోటీసులు అందించాలని సీఐడీ ఎంత ప్రయత్నించినా ఆయన అడ్రస్ దొరకలేదని.. నివాస స్థలంతోపాటు, ప్రయాణిస్తున్న కార్లను కూడా మారుస్తూ “దొంగ – పోలీస్” ఆట ఆడుతున్నాడంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తప్పుచేయనప్పుడు తప్పించుకు తిరగడం ఎందుకు అంటూ కామెంట్లు చేశారు. ఈ సమయలో పరిస్థితి తీవ్ర అర్ధం అయ్యిందో ఏమో కానీ… తాజాగా ఈ విషయంపై తాజాగా లోకేష్ స్పందించారు.
ఇందులో భాగంగా… తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఎక్కడికీ పోలేదని నారా లోకేష్ చెప్పారు. ప్రస్తుతం హోటల్ మౌర్యాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అప్పుడప్పుడూ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నట్లు వెల్లడించారు. సో… సీఐడీ వాళ్లు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని లోకేష్ అన్నారు. తాను ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉంటూ నిత్యం పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
అయితే శుక్రవారం అంతా లోకేష్ అందుబాటులోకి రాకపోవడంతో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు వాట్సప్ ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. అనంతరం అడ్రస్ వెల్లడి అవ్వడంతో అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ ఇంటిలో ఉన్న జయదేవ్ ఆఫీసుకు వెళ్లిన సీఐడీ అధికారులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగు రోడ్డు అలైన మెంట్ కేసులో అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు.
ఈ నోటీసుల్లో ప్రధానంగా సీఐడీ పేర్కొన్న విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా… ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదని సూచించారు.
ఇదే సమయంలో… పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి అని పేర్కొన్నారు. ఇక హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలని.. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ కూడా అందించాలని లోకేష్ ను సీఐడీ అధికారులు కోరారు.
ఇదే క్రమంలో అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురావాలని సూచించిన సీఐడీ అధికారులు… నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకోపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ(3), (4) ప్రకారం అరెస్టు తప్పదు అని నోటీసుల్లో పేర్కొన్నారని తెలుస్తుంది.