Tuna Fish: ఆ చేప ఖరీదు 11 కోట్లు.. ఎక్కడంటే?

ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సర వేళ చేపల మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువున్న ఈ చేప వేలంలో అధిక ధరకు అమ్ముడైంది. జపాన్‌లోని ప్రముఖ సుషీ రెస్టారెంట్ సంస్థ ఒనోడెరా ఈ చేపను సుమారు రూ.11 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

జపనీయుల నమ్మకానికి తగ్గట్టుగా, కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను దక్కించుకోవడం శుభ సూచికంగా భావిస్తారు. అదృష్టాన్ని తీసుకువస్తుందని భావించే ఈ సంప్రదాయం కారణంగా మార్కెట్‌లో వేలం ప్రతిసారి తీవ్ర పోటీతో మొదలవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. భారీ ధరకు ఈ చేపను కొనుగోలు చేసిన ఒనోడెరా హోటల్ సంస్థ తమ వినియోగదారులకు ప్రత్యేకమైన సుషీ అనుభవాన్ని అందించడమే కాకుండా, నూతన సంవత్సరానికి శుభారంభం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అతిపెద్ద ట్యూనా చేపలు వేలంలో అధిక ధరకు అమ్ముడవడం జపాన్‌లో అరుదైన విషయం కాదు. 2019లో 278 కిలోల ట్యూనా చేప రూ.18 కోట్లు పలికిన రికార్డు ఇప్పటికీ నిలిచివుంది. ఈసారి రూ.11 కోట్లకు అమ్ముడైన ట్యూనా చేప రెండో స్థానంలో నిలిచింది. ఒనోడెరా సంస్థ గతంలోనూ ట్యూనా చేప కోసం భారీ ధర చెల్లించి వార్తల్లో నిలిచింది.

ఈ అరుదైన చేపపై చర్చలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ఈ చేప మా కస్టమర్లకు అదృష్టాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాం. సుషీ ప్రియులకు ప్రత్యేకమైన నూతన సంవత్సర జ్ఞాపకాలను అందించడమే మా లక్ష్యం,’’ అని ఒనోడెరా ప్రతినిధి వ్యాఖ్యానించారు.

రీతుచౌదరి స్కాంలో Ys భారతి పాత్ర | Analyst Purushottam Reddy About Rithu Chowdary | Ys Bharathi | TR