రాజకీయాల్లో పొత్తులు అనేవి పరస్పరం గౌరవించుకునేలా.. కాస్త అటు ఇటుగా సరిసమానమైన లబ్ధి చేకూరేలా ఉండాలని అంటారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా అన్నట్లుగా ప్రస్తుతం ఏపీలో పొత్తులు నడుస్తున్నాయనే చర్చ ఒక వర్గంలో బలంగా వినిపిస్తుంది. దీంతో… దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న ఒక ఆశ.. అర్ధాంతరంగా మృత్యువాత పడిందనే మాటలు వినిపిస్తుండటం గమనార్హం.
ఏపీ రాజకీయాల్లో బీజేపీకీ టీడీపీకి మధ్య ఉన్న సంబంధం సామాన్యులకు అర్ధం కాదని చెబుతుంటారు. అసలు వారిరువురూ ఎందుకు కలుస్తారో.. ఎందుకు విడిపోయి కలబడతారో.. వ్యక్తిగత విమర్శలు సైతం ఎందుకు చేసుకుంటారో.. ఆ తర్వాత మళ్లీ కౌగిలించుకుని కలుస్తారో ఎవరికీ అర్ధం కాదనే చర్చ నడుస్తుంటుంది. అయితే ఇది ఈ నాడు కొత్తగా మొదలైంది కాదు.
అసలు ఏపీలో బీజేపీ ఇప్పటికీ ఎదగకపోవడానికి టీడీపీతో పొత్తే కారణం అని.. కాస్త ఆలోచన ఉన్నవారెవరికైనా ఇట్టే తెలిసే అంశం అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో ఉంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట… ఇంకా గట్టిగా చెబితే కేంద్రంలో అధికారంలో ఉంటుంది బీజేపీ. అందువల్ల.. ఆ పార్టీ ఏపీలో ఉద్దరించకపోయినా.. ఎదగకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు.
అయితే ఏపీలో తప్ప మరో చోట నిలవలేని.. ఏపీలోని కొంతమంది ప్రజలు ఎన్నో ఆశలుపెట్టుకున్న పార్టీ పరిస్థితి ఏమిటి? అదే జనసేన పార్టీ! చంద్రబాబుతో పొత్తు పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేసిందనే చర్చ ఇప్పుడు కాపు సామాజికవర్గంలోని మేధావులు, పెద్దల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తుందని అంటున్నారు. ఇది పూర్తిగా తనదైన అవగాహనా రాహిత్యంతో పవన్ చేసుకున్న స్వయంకృతాపరాధం అనేది వారి మాటగా ఉందని తెలుస్తుంది.
ఒకసారి ప్లాష్ బ్యాక్ కి వెళ్తే… 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 137 స్థానాల్లో పోటీ చేసి, 5.53 శాతం ఓట్లు రాబట్టుకున్నారు. గెలిచింది ఒక్క సీటే అయినా… ఇక్కడ ఓట్ల శాతం కీలకం. కారణం… ఆ ఐదున్నర ఓట్లే టీడీపీ చావుదెబ్బ తినడానికి కారణమయ్యాయని అంటారు. ఇక బీజేపీ విషయానికొస్తే… 173 సీట్లలో పోటీచేసి ఒక్కసీటు కూడా గెలవలేదు సరికదా.. ఒక్కశాతం కూడా ఓట్లు రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం 0.84 మాత్రమే!
ఈ లెక్కన చూసుకుంటే… పొత్తులో భాగంగా… 0.84 శాతం సీట్లు వచ్చిన బీజేపీకి ఇస్తున్న సీట్లకు.. 5.53శాతం ఓట్లు సాధించుకున్న పార్టీకి ఇచ్చిన సీట్లకు ఏమైనా పోలిక ఉందా. తక్కువలో తక్కువ కనీసం పావు వంరు సీట్లయినా అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి 21 స్థానాలకు పరిమితం కావడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీంతో రెండు రకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ఒకటి… వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా జనసేన ను నిజంగా, సిన్సియర్ గా పవన్ కల్యాణ్ స్థాపించి ఉండరు.. దాని వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబు అయ్యి ఉంటారని! కాగా… మరొకటి పవన్ కల్యాణే సొంతంగా పార్టీ పెట్టి ఉంటే… ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు.. అతని పార్ట్ టైం పాలిటిక్స్ కోసం జీవితాలు పాడుచేసుకోవాల్సిన అవసరం ఆయనను ఫాలో అవుతున్న యువతకు లేదు అని!!
ఈ నేపథ్యంలో… దేశాన్నే ఏలుతున్న పార్టీ ఏపీలో మాత్రం ఎదగకపోవడానికి కారణం చంద్రబాబు హయాంలో పెట్టుకున్న పొత్తులు అని అంటుంటే… ఫ్యూచర్ లో లోకేష్ నాయకత్వంలో జనసేన కూడా కొత్త బీజేపీ.. లేదా, జూనియర్ బీజేపీ బోర్న్ ఫర్ టీడీపీ అన్నట్లుగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.