సాధారణంగా మెజారిటీ రాజకీయ నాయకులు సొల్లు కబుర్లు చెబుతారని.. సాధ్యంకాని హామీలు ఇస్తారని.. అవి సాధ్యం కాదన్న విషయం తెలిసి కూడా ప్రజలను ఏమారుస్తారని అంటుంటారు. ఇదే సమయంలో ఈ విషయంలో చంద్రబాబు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కూడా అంటుంటారు. ఈ సమయంలో తానేమీ తక్కువ తినలేదంటున్నారు లోకేష్!
అవును… సాధ్యం కాదని తెలిసినా కూడా హామీలిచ్చే రాజకీయ నాయకులను అసహ్యించుకునే రోజులు వచ్చేశాయన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడిని అని చెప్పుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు లోకేష్. ఇందులో భాగంగా తాజాగా యువగళం పాదయాత్రలో ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
తాజాగా చినబాబు లోకేష్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో సాగుతోంది. అక్కడ ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రైతులపై ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని పచ్చ మీడియా బ్యానర్ చేయడం విశేషం. అసలు రైతులపై కేసులు ఎందుకు ఉంటాయి. ఉంటే అవి వ్యక్తిగతమైన కేసులు అవుతాయి తప్ప మరొకటి కాదు! అయినా సరే రైతు అనే వారిపై ఏ కేసు ఉన్నా మాఫీ అంటున్నారు.
ఇలా తనదైన జ్ఞానంతో లోకేశ్ ఇచ్చిన ఈ హామీపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గ్రామాల్లో అత్యధిక ప్రజలు రైతులు, రైతు కుటుంబాలే ఉంటాయి. అక్కడ రకరకాల సమస్యలతో పోలీస్ స్టేషన్ లో కేసులు ఉంటాయి. గట్టు తగాదాలో మరొకటో మరొకటో ఉంటాయి. ఈ సమయంలో రైతులకు మరో సమస్య ఏమీ లేదన్నట్లుగా… రైతులపై కేసులు ఎత్తేస్తామని చెబుతున్నారు లోకేష్!
దీంతో గతం గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. 2014 ఎన్నికల ప్రచారంలో తమకు అధికారం ఇస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. హామీకి కట్టుబడి రుణమాఫీ చేస్తారని అధికారాన్ని ఇస్తే, ఆ పని చేయలేదని.. ఇప్పుడు కేసులన్నీ మాఫీ చేస్తామని కబుర్లు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.
పైగా టీడీపీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తొలిసారి అధికారం చేపట్టడానికి వెయిట్ చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికే 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి సంబందించిన వ్యక్తి ఇలాంటి మాయ హామీలు ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఏ హామీ అయినా ఇచ్చే అధికారం ప్రస్తుతం జనసేన పవన్ కల్యాణ్ కే ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాము ఇంతవరకూ అధికారంలో లేము కాబట్టి ప్రజలు తమను నమ్మొచ్చని అంటున్నారు. అయితే… 2014లో అధికారంలో ఉన్నది టీడీపీ మాత్రమే కాదని… అనధికారికంగా పవన్ కూడా అందులో భాగస్వామని.. ఆ విషయం పవనే ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తుచేస్తున్నారు వైసీపీ నేతలు.
దీంతో… జనాన్ని నమ్మించడానికి లోకేష్ అయినా, పవన్ అయినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయం మరిచిన చినబాబు మాత్రం.. గోదావరి జిల్లాల్లోకి ఎంటరైన సందర్భంగా… రైతులపై ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పడం నిస్సిగ్గు వాగ్ధానం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫేక్ హామీలు ఇవ్వడంలో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ ఎదుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.