రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో వైసీపీ – టీడీపీ మధ్య పోటీ నెలకొంటున్నా.. 21 స్థానాల్లో మాత్రం వైసీపీ – జనసేన మధ్య పోరు జరగబోతోంది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. అత్యంత రసవత్తరంగా ఇక్కడ పోరు ఉండబోతుందని అంటున్నారు. ఇద్దరు కాపు సామాజికవర్గ నేతలు తలపడుతున్న ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం..!
అవును… ప్రత్యేకంగా ఏ పార్టీకి కంచుకోట కాదు అన్నట్లుగా ఉండే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలలతో పాటు ప్రజారాజ్యం, బీజేపీ కూడా గెలిచాయి. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పటికే 2004, 2019 ఎన్నికల్లో గెలిచిన ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా.. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు.
అయితే వీళ్లిద్దరూ ఎన్నికల్లో తలపడటం ఇదే మొదటిసారి కాదు కానీ… కేవలం వీరిద్దరు మాత్రమే ప్రధానంగా బరిలో నిలవడం మాత్రం ఇదే ఫస్ట్ అని చెప్పాలి. ఇందులో భాగంగా… 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణకు 70,741 ఓట్లు పోలవ్వగా.. బొలిశెట్టి శ్రీనివాస్ కు 36,197 ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ కూడా తోడవ్వడంతో గెలుపు కన్ ఫాం అని బొలిశెట్టి చెబుతుండగా.. జగన్ పాలనే తనకు శ్రీరామరక్ష అని కొట్టు చెబుతున్నారు.
ఈ తాడేపల్లిగూడేంలో మొత్తం 2,14,554 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్లు సుమారు సగం మంది వరకూ ఉన్నారు. ఇందులో భాగంగా… సుమారు లక్షా తొమ్మిది వేలు ఉన్న ఈ మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో మెజారిటీగా సుమారు 60శాతం మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఉన్నారు. దీంతో ఏ పార్టి నుంచి అయినా కాపులే ఇక్కడ అభ్యర్థులుగా ఉంటారు.
ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఇదే సమయంలో… నియోజకవర్గంలో అన్ని రోడ్లు నూతనంగా నిర్మించామని, వందల కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి చేశామని అంటున్నారు. ఇదే క్రమంలో… నియోజకవర్గంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాయని నొక్కి చెబుతున్నారు. అవే తనను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క విపక్షాలు మాత్రం.. నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా, అవినీతే ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో… ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్న కాపులు జనసేన వైపు మొగ్గు చూపుతారా.. లేక, జగన్ పాలనకు, స్థానికంగా కొట్టు సత్యనారాయణ చేసిన అభివృద్ధికి పట్టం కడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా.. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కచ్చితంగ హాట్ టాపిక్ అనే చెప్పాలి.