గతకొంతకాలంగా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో కొత్త కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నప్పుడే కొద్ది కొద్దిగా పొగలు రావడం మొదలైన ఈ వ్యవహారం… ఆయనను సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించడంతో మొత్తం సెగలు కక్కడం మొదలుపెట్టింది.
ఈ సమయంలో ఇంతకాలం టీడీపీని ఎవరి బారినుంచైతే కాపాడామో.. ఇప్పుడు ఆయన చేతికే సత్తెనపల్లి టీడీపీ పగ్గాలు ఇచ్చారంటూ కొంతమంది సీనియర్, సిన్సియర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ సమయంలో కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కొడెల శివరాం గట్టిగా రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా… కన్నాతో సుదీర్ఘ కాలం పోరాడామని.. ఆయన వల్ల కేసులు పెట్టుకుని ఇబ్బందులపాలయ్యామని.. అలాంటి నాయకుడిని తమ నెత్తిపై రుద్దడం ఏంటని కోడెల శివరామ్ నిలదీస్తున్నారు. ఇది సత్తెనపల్లిలోని తనొక్కడి బాదా కాదని.. ప్రతీ టీడీపీ నాయకుడి, కార్యకర్త ఆవేదన అని స్పష్టం చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నా నాయకత్వాన్ని తాము ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా చంద్రబాబును తనతో పాటు తన తల్లి కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నా పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోడెల కుటుంబాన్ని వెన్నుపోటి పొడిచారన్నట్లుగా పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు శివరాం.
ఆ సంగతి అలా ఉంటే… తాజాగా లోకేష్ యువగళం పాదయాత్ర పల్నాడులో ప్రవేశించింది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది. టీడీపీ కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొనడం లేదో వివరణ ఇవ్వాలంటూ కోడెల శివరామ్ తో పాటు మరో 16 మందికి టీడీపీ నోటీసులు ఇచ్చింది. దీంతో తనపని తాను చేసుకుపోతోన్న శివరాం ఈ నోటీసులపై సీరియస్ గా స్పందించారు.
దశాబ్దాలుగా టీడీపీ ఉన్నతి కోసం కష్టపడుతున్న వారికి నోటీసులు ఇవ్వడం ఏంటని శివరామ్ ప్రశ్నించారు. కనీసం టీడీపీ కార్యాలయంలో ఏనాడూ అడుగు పెట్టని కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు ఇవ్వరా అని నిలదీశారు. పార్టీ కోసం పని చేసే తనలాంటి వాళ్లకు నోటీసులు ఇవ్వడంవెనకున్న మతలబు ఏంటని ఆయన ఫైర్ అయ్యారు.
దీంతో… శివరాం ని చినబాబు లేపి తన్నించుకున్నట్లు అయ్యిందని అంటున్నారు పలువురు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబునే ఎదురించి నిలదీసి మాట్లాడుతున్న శివరాం కు.. తగుదునమ్మా అంటూ చినబాబు పాదయాత్ర కోసం నోటీసులు ఇవ్వడం అనాలోచిత చర్య అని… ఫలితంగా వాయింపులు భారించాల్సి వచ్చిందని అంటున్నారు!
మరి రోజు రోజుకీ చినికి చినికి గాలివానగా మారుతోన్న సత్తెనపల్లి పంచాయతీపై బాబు దృష్టి సారిస్తారా.. లేక, పోయే సీట్లలో అదీ ఒకటి అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి!