విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీలోనే వున్నారా.? చాలాకాలంగా టీడీపీ శ్రేణులకు ఈ డౌట్ వస్తూనే వుంది. ఆ డౌట్ మరింతగా బలపడిన ప్రతిసారీ, కేశినేని నాని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో కలిసి ప్రత్యక్షమవుతుంటారు. అంతలోనే, టీడీపీ మీద పరోక్షంగా విమర్శలు చేస్తుంటారు కేశినేని నాని.
‘పక్కలో బల్లెం’ అనే మాట కేశినేని నానికి బాగా సెట్ అవుతుందేమో.! ఇప్పుడే కాదు, 2014 నుంచీ ఆయనది ఇదే తంతు.! 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపికైన ముగ్గురు లోక్ సభ సభ్యుల్లో కేశినేని నాని ఒకరు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గత కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేయడం డౌటే. కింజరాపు రామ్మోహన్నాయుడు ఒక్కరే టీడీపీ కోసం నిబద్ధతగా పనిచేసే వ్యక్తి.. అని చెప్పుకోవాలేమో.. ముగ్గురు ఎంపీల్లో.! ఇక, కేశినేని నాని వ్యవహారానికొస్తే, ఆయన తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కేశినేని నాని అనుచరులకీ, టీడీపీ అనుచరులకీ మధ్య గలాటా చోటు చేసుకుంది. సొంత పార్టీలో, తమ్ముడు కేశినేని చిన్ని రూపంలో కేశినేని నానికి తలనొప్పులు ఎదురవుతున్నాయి ఈ మధ్యకాలంలో.
కేశినేని నాని ‘పక్కలో బల్లెంలా’ తయారైన దరిమిలా, చంద్రబాబే వ్యూహాత్మకంగా కేశినేని చిన్నిని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ, కేశినేని నాని రాజీనామా నిజమేనా.? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు.? వైసీపీ నుంచి ఆయనకు టిక్కెట్టు ఖరారైనట్లు ప్రచారమైతే జరుగుతోంది.
బీజేపీ కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చిందంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. కేశినేని నాని మాత్రం, ‘ఇండిపెండెంటుగా అయినా గెలుస్తా..’ అని చెబుతున్నారు. మళ్ళీ విజయవాడ ఎంపీని నేనే.. అని బల్లగుద్ది మరీ చెబుతున్న వైనం, టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.