విశాఖపట్నంలో ‘వారాహి’ విజయ యాత్ర జరుగుతోంది. నిన్న జగదాంబ సెంటర్లో బహిరంగ సభ జరిగింది. రుషి కొండ సందర్శన కోసం జనసేనాని ఏర్పాట్లు చేసుకుంటారని ప్రభుత్వానికి ముందే సమాచారం అందింది. పవన్ పర్యటనకు బ్రేకేలేయడానికి అధికార యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధమైపోయింది.
నిజానికి, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం నానా రకాల ఆంక్షలూ విధించింది.. ఆ ఆంక్షలు పని చేయవని ప్రభుత్వ పెద్దలకీ తెలుసు. కాకపోతే, ఏదో ఓ ప్రయత్నం అలా చేయాలి కాబట్టి.. చేసిందంతే.
పోలీసులు ఎక్కడికక్కడ బహిరంగ సభకు జనం వెళ్ళకుండా నానా తంటాలూ పడ్డారు. బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. వాటిని దాటుకుని జనం, వారాహి విజయ యాత్రకు హాజరయ్యారు. జనసేన పార్టీ ముఖ్య నేతలు కూడా, ఈ స్థాయి జనసంద్రాన్ని ఊహించి వుండరు. ఇదిలా వుంటే, రుషికొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని కార్యకలాపాల్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు.
ఈ దిశగా అక్కడ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే, ప్రకృతి అందాలకు నెలవైన రుషికొండకి బోడిగుండు కొట్టేయడం విశాఖ ప్రజలకీ నచ్చడంలేదు. అయినా, వైఎస్ జగన్ సర్కారు, రుషి కొండని గొరిగేయడమైతే ఆపడంలేదు. ఈ క్రమంలో రుషికొండ, విశాఖ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్ అయ్యింది.
జనసేన అధినేత, ఆ రుషికొండ కేంద్రంగానే, వైసీపీ సర్కారుని ఏకి పారేయడం మొదలు పెట్టారు. సహజంగానే విశాఖ ప్రజలకి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నచ్చుతోంది. అయినా, ప్రభుత్వమెందుకు ఈ విషయంలో లేనిపోని ప్రతిష్టకు పోతున్నట్టు.?