జనసేన – బీజేపీ కూటమికి బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు వుంటాయని ఆశిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి జనసేన మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ వేరు పడ్డాయ్.
2019 ఎన్నికల్లో మూడు పార్టీలూ విడివిడిగానే పోటీ చేశాయ్. కానీ, ఆ తర్వాత బీజేపీ – జనసేన కలిశాయి. ప్రస్తుతం టీడీపీ – జనసేన కలిసి పని చేస్తున్నాయ్.. బీజేపీ – జనసేన కలిసి వున్నాయ్. టీడీపీ – బీజేపీ మధ్య మాత్రం సఖ్యత కుదరడంలేదు.
‘మేం టీడీపీతో కలవబోం’ అని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయినాగానీ, బీజేపీ తమ కూటమితో కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు జనసేనాని చెబుతున్నారు. ‘మేం టీడీపీతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.
ఏపీలో వైసీపీని దించాలంటే, టీడీపీ – బీజేపీ – జనసేన కలవాలి’ అని బీజేపీ అధినాయకత్వానికి గతంలోనే పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని వాడుకున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి, జనసేన మాటకు పెద్దగా విలువ ఇవ్వడంలేదు.
వాస్తవానికి, తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి తెరవెనుకాల సాయం చేసింది టీడీపీ. ఆ మంట బీజేపీకి ఖచ్చితంగా వుంటుంది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగైదు స్థానాల్ని (లోక్ సభ) ఆశిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఈ విషయమై జనసేన అధినేతకు బీజేపీ అధినాయకత్వం సమాచారం కూడా ఇచ్చిందట. చంద్రబాబు గనుక ఆ ప్రతిపాదనకు ఓకే అంటే, టీడీపీతోనూ బీజేపీ కలిసే అవకాశాల్లేకపోలేదు.
కాగా, బీజేపీ తమతో కలిసొస్తే, జనసేన పార్టీని నిర్మొహమాటంగా టీడీపీ పక్కన పెట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదన వుంది. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. బీజేపీ కోరుకున్న సీట్లు ఒకవేళ వైసీపీ నుంచి వెళితే, బీజేపీ – వైసీపీ కూటమి ఖరారయ్యే అవకాశాలూ వున్నాయ్. ఏ ఈక్వేషన్ సెట్ అవుతుందన్నది రెండు మూడు వారాల్లోనే ఓ క్లారిటీ వస్తుంది.
అటు వైసీపీ కూడా బీజేపీ ఆశీస్సుల్ని కోరుకుంటుండడం కొసమెరుపు.!