“తనకు సూచనలు ఇచ్చేవారు వద్దని పవన్ ఎన్నిసార్లు చెప్పినా హరిరామ జోగయ్య మారడం లేదు.. కాపుల క్షేమం, పవన్ క్షేమం కోరి జోగయ్య ఎన్నో సూచనలు చేస్తున్నా పవన్ మారడం లేదు”.. అనే చర్చ ఇప్పుడు ఆ సామాజిక వర్గ ప్రజానికంలో బలంగా వినిపిస్తుంది. ఇదే సమయంలో… జోగయ్య వయసుకు వస్తే తప్ప పవన్ కు తత్వం బోధపడకపోవచ్చని కొందరంటే… 2024 ఎన్నికల ఫలితాలు రాగానే బోధపడే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఈ సమయంలో జోగయ్య మరో లేఖ రాశారు.
అవును… తనకు సూచనలు, సలహాలూ ఇచ్చేవారు అవసరం లేదు అంటూ తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు ప్రధానంగా జోగయ్యను దృష్టిలో పెట్టుకునే పవన్ చేశారనే చర్చ బలంగా నడిచింది. ఈ సమయంలో తగ్గేదే లే అన్నట్లుగా జోగయ్య మరోసారి లేఖ రాశారు. పవన్ కల్యాణ్ వద్దాన్నా కూడా తాను మరణించేవరకూ జనసేన పార్టీ ప్రయోజనాలకోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు!
ఈ నేపథ్యంలో.. ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు జోగయ్య. ఇదే సమయంలో తాజా లేఖలో ప్రధానంగా రాయలసీమలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను సైతం జోగయ్య వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు తాను సూచించిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వాలని.. వీరంతా గెలిచే గుర్రాలని.. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో వీరి పేర్లను సూచిస్తున్నానని జోగయ్య సూటిగా స్పష్టంగా తెలిపారు.
ప్రధానంగా సీమలో సుమారు 20 లక్షల మంది బలిజ ఓటర్లు ఉన్నారని తెలిపిన జోగయ్య… వీరిని ఏ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని.. ఈ నేపథ్యంలో బలిజలకు జనసేన న్యాయం చేయాలని.. ఇందులో భాగంగా తాను సూచించినవారికి టిక్కెట్లు ఇస్తే అది సాధ్యమవుతుందన్నట్లుగా తెలిపారు.
ఇందులో భాగంగా… తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు, అనంతపురం నుంచి టీసీ వరుణ్, రాజంపేట నుంచి ఎంవీ రావు, గుంతకల్లు నుంచి మణికంఠ, పుట్టపర్తి నుంచి శివశంకర్, తంబళ్లపల్లె నుంచి కొండా నరేంద్ర లకు టిక్కెట్లు ఇవ్వాలని జోగయ్య సూచించారు. కాగా… తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మునూరు జయరాం… తాను టీడీపీ టిక్కెట్ పై గుంతకళ్లు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా… జనసేనకు సలహాదారుడు, ఎన్నికల వ్యూహకర్త వంటి పదవులను అనధికారికంగా పోషిస్తూ జోగయ్య ఇస్తున్న సూచనలు ఆ పార్టీలో పవన్ కి తప్ప జనసైనికులందరికీ నచ్చుతున్నాయనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుండటం గమనార్హం.