రానున్న ఎన్నికల్లో ఏపీని పాలించేది జనసేన ప్రభుత్వమే! సీఎం అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను! పాతికో పరకో సీటు బిక్షం వేస్తే తీసుకోవడానికి సిద్ధంగాలేను! గౌరవప్రదమైన స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుంది! జనసైనికుల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టను! మనల్ని ఎవడ్రా ఆపేది!…. కాస్త అటు ఇటుగా గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మేంట్స్ లో కొన్ని ఇవి! వేదికపై నుంచి పవన్ ఇవి చెబుతున్నప్పుడు… కింద జనసైనికుల ఈలలు, కేకలు, చప్పట్లు!!
ఈ సమయంలో టీడీపీతో పొత్తు అని ప్రకటించగానే… పొత్తులో భాగంగా కనీసం సగం స్థానాలు జనసేన దక్కించుకోవాలి! మరీ కాదూ కూడదని చంద్రబాబు కాళ్లుపట్టేసుకుంటే.. 60 – 70 స్థానాలు తగ్గకుండా తీసుకోవాలి! మరీ కాదనుకుంటే… కనీసం 50! వీటితోపాటు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పీఠం కూడా అడగాలి! సగం కాలం పాటు సీఎం పదవి ఇస్తానంటేనే పొత్తు పెట్టుకోవాలి! మరీ 24 స్థానాలకు 21 స్థానాలకూ ఒప్పేసుకోవడం ఏమిటి? సిగ్గు సిగ్గు!! జనసేన అంటే అంత చిన్నచూపా చంద్రబాబుకి?! టిక్కెట్ల ప్రకటన అనంతరం కాస్త అటు ఇటుగా వినిపించిన మాటలు ఇవి!
కట్ చేస్తే… ఆ తన పిఠాపురం టిక్కెట్ కాకుండా మిగిలిన 20 స్థానాల్లో కూడా జనసేనకు అభర్థులు లేని పరిస్థితి!! ఉన్నా కూడా వారిలో గెలిచే సత్తా కానీ.. నిలిచే సత్తా కానీ లేని పరిస్థితి అన్నట్లుగా ఉందని పవన్ కల్యాణ్ పరోక్షంగా చెబుతున్న పరిస్థితి! అందుకే… పవన్ కల్యాణ్ 10ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నవారికి కాకుండా… గత్యంతరం లేని పరిస్థితుల్లో పక్కపార్టీల నుంచి పిలిచి జనసేన కండువా కప్పి టిక్కెట్ ఇచ్చుకుని, తన వాటాగా వచ్చిన 21 స్థానాలను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి!
ఈ క్రమంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన అరణి శ్రీనివాసులు వంటి వారితో పాటు, టీడీపీ నుంచి వచ్చి చేరిన పులపర్తి ఆంజనేయులు కు కూడా టికెట్ ఇచ్చారు. పైగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేనకు బలమైన నేతలే ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో… విశాఖ సౌత్ లో వంశీకృష్ణ యాదవ్, పాలకొండలో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకే టిక్కెట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. కాకపోతే.. జనసేన కండువా కప్పిన తర్వాతే!
గత కొన్ని రోజులుగా కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని అవనిగడ్డకు పంపించి.. మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ వంగవీటి రాధకు ఇస్తారనే ప్రచారం కూడా నడిచింది. అయితే ఆందుకు బాలశౌరి ఏమాత్రం అంగీకరించకపోవడంతో… అవనిగడ్డ టిక్కెట్ కూడా టీడీపీకి చెందిన నేతకే ఇవ్వాలని పవన్ ఫిక్సయ్యారంట. కాకపోతే ఆయనకు జనసేన కండువా కప్పుతారు!
ఇందులో భాగంగా… మండలి బుద్ధప్రసాద్ ను జనసేనలో చేర్పించుకుని.. అవనిగడ్డ టిక్కెట్ ను ఆ విధంగా ఫిల్ చేసేయాలని పవన్ భావిస్తున్నరని తెలుస్తుంది! అయితే… అవనిగడ్డలో జనసైనికులు ఎవరూ లేరా అని అంటే… అక్కడ పవన్ చేయించుకున్న సర్వేల్లో ఎవరూ బలమైననేత లేరనే ఫలితం వచ్చిందని.. గ్రౌండ్ రియాలిటీ ఇదే అని ఒక కన్ క్లూజన్ కు వచ్చారంట పవన్!! దీంతో… అన్ని స్థానాలకూ అభ్యర్థుల ప్రకటనను మమ అనిపించేసి ఇకపై ప్రచారాలతో హోరెత్తించబోతున్నారని తెలుస్తుంది!
ఈ కారణాలతో విసుగుచెందిన పలువురు జనసైనికులు, కాపుసామాజికవర్గానికి చెందిన వ్యక్తులతో పాటు, కులమతాలకు అతీతంగా పవన్ ని అభిమానించేవారు సైతం… ఇంతోటి దానికి సీట్ల సర్దుబాట్లపైచర్చ అంటూ హడావిడి చేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తుండటం కొసమెరుపు!