ఏపీలో ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారాల్లో ఫుల్ బిజీ అయిపోయాయి. అందులో భాగంగా ఇప్పటికే మహానాడు వేదికగా టీడీపీ తమ తొలివిడత మేనిఫెస్టోని ప్రకటించేసింది. దానికి సూపర్ సిక్స్ అని ముద్దు పేరు పెట్టుకుంది. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా తన వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చేస్తున్నారు. అలా అని అవేవో నియోజకవర్గ స్థాయి హామీలు అనుకునేరు… రాష్ట్రస్థాయిలో హామీలు. కాకపోతే కండిషన్స్ అప్లై అంతే!
వైఎస్ జగన్ హామీలు ఇచ్చారంటే దానికి అర్ధం ఉంది. తానే సీఎం అభ్యర్థి కాబట్టి… సాధ్యసాధ్యాలు ముందే ఆలోచించుకుని హామీలు ఇస్తారు.. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తారు. 2019 ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. ఆ హామీలను నెరవేర్చే విషయంలో జగన్ సక్సెస్ కూడా అయ్యారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా సుమారు 600 పైచిలుకు హామీలు ఇచ్చారు! వాటి అమలు గురించి ప్రశ్నించే లోపు 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే సరిపోతుంది.
ఇప్పుడు తాజాగా పవన్ కూడా కీలకమైన హామీలు ఇచ్చేస్తున్నారు. పవన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తులతోనే కలిసి వెళ్తామని చెబుతున్నారు.. సీఎం సీటు అంటే సీనియారిటీ ఉండాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకూ చెప్పిన సీఎం మాటలు… జస్ట్ మా వాళ్ల తృప్తి కోసం అని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పొత్తులో భాగంగా పాతిక ముప్పై సీట్లు మాత్రమే దక్కుతాయని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజలను మాయచేయడానికి పవన్ ఒక హామీని తెరపైకి తెచ్చారు.
అయితే అది అచ్చుగుద్దినట్లుగా తెలంగాణలో కేసీఆర్ చెప్పిన దళితబంధు పథకంలా ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం అనివార్యం అయినప్పుడు కేసీఆర్ ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ప్రజలు నమ్మలేదు. అయితే తాజాగా ఏపీలో కూడా దళిత బంధు తరహా పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అవును… జనసేన అధికారం లోకి వస్తే యువత కు పెద్ద పీట వేశ్తామని మొదలుపెట్టిన పవన్… ఏడాదికి లక్ష చొప్పున ప్రతీ నియోజకవర్గానికీ 500 మంది యువతను గుర్తించి వారికి పదిలక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు. ఫలితంగా వాళ్లు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని కామెంట్లు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీలనుంచి.. ఏపీలో జగన్ ఇప్పటికే అమలు చేస్తున్న హామీలనుంచీ కాపీకొట్టి ముద్రించారని విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఉన్న వాస్తవాన్ని గమనించి… టీడీపీ నేతలు కూడా ఆ ప్రస్థావన పెద్దగా తీసుకురావడం లేదు. అయితే… తాజాగా పవన్ ఆ విషయంలో కూడా చంద్రబాబునే ఫాలో అవ్వాలనుకున్నారో ఏమో కానీ… తెలంగాణలో కేసీఆర్ “దళిత బంధు” పథకాన్ని కాపీ కొట్టేశారు.
మరి ఈ కాపీ పథకాలను, పక్క రాష్ట్రాల నుంచి కాపీకొట్టిన హామీలను ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారనేది వేచి చూడాలి!