ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి.. వైసీపీ నేతలు కబ్జాలు చేసేశారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా అదే జరిగితే.. ఇప్పుడు అధికారంలో ఉన్నది వీరే కాబట్టి వారిపై చర్యలు తీసుకోవచ్చు! కానీ… ప్రస్తుతానికి ఆరోపణలకు, విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో.. ఇంకా వైసీపీనే అధికారంలో ఉందని అనుకుంటున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోపక్క అవినీతికి తావులేదు, అక్రమాలకు అవకాశం లేదు అంటూ అసెంబ్లీలో కూటమి నేతలు, ప్రధానంగా పవన్ కల్యాణ్ వంటి వారు శ్రీరంగనీతులు వల్లిస్తున్న పరిస్థితి! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మాత్రం నోరు మెదపని పవన్.. చంద్రబాబుతో కలిసి తానూ మునిగిపోతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా జనసేన ఎమ్మెల్యే కబ్జా వ్యవహారం తెరపైకి వచ్చిందని అంటున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… అనకాపల్లి టౌన్ లోని సర్వే నెంబర్ 66లో సుమారు 29.71 ఎకరాల భూమి, చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి మహాదేవి.. దేవాదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు! ఈ నేపథ్యంలోనే.. తన తదనంతరం ఈ భూమిని దేవాదాయ శాఖకు అప్పగించాలని, అప్పటివరకూ ట్రస్టీలుగా ఉన్న పెద్ద అల్లుడు రాజూభీర్ ఉదిత్ ప్రతాప్ శంకర్, డాక్టర్ పేర్రాజు, లాయర్ రామచంద్రరావులను నియమించారు.
అయితే ఆమె మరణానంతరం ఈ భూములను తమకు అప్పగించాలని దేవాదాయ శాఖ అధికారులు 1963లో సదరు ట్రస్టీలను కోరగా.. దీనిపై ట్రస్టీలు కోర్టును ఆశ్రయించారు. అయితే 1996లో కోర్టు.. దేవాదాయ శాఖకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో… ఆ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని చుట్టూ పెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని కూడా నియమించారు. అయితే దీనిపై జనసేన ఎమ్మెల్యే కన్నేశారని అంటున్నారు!
అవును... జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు.. అనకాపల్లిలోని కనకమహాలక్ష్మీ అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారని అంటున్నారు. ఇందులో భాగంగా.. కోర్టు ఆర్డర్ పేరిట ఉన్న ఆ భూమిని ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న బోర్డుల్ని పీకేశారట.
ఈ నేపథ్యంలో.. కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు జేసీబీతో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారట. దీంతో విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు, సీఐటీయూ నాయకులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారని చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
దీంతో… పవన్ కల్యాణ్ అసెంబ్లీలో చెప్పే కబుర్లకూ, వారి నేతలు బయట చేస్తున్న పనులకు ఏమైనా పొంతన ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన… మైనర్ బాలికలపై వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా స్పందిచడం లేదు! దీంతో… పవన్ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని గ్రహించిన వారి ఎమ్మెల్యేలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!