జగన్ ది వ్యూహాత్మక నిర్ణయమా, చారిత్రక తప్పిదమా

Advisory committee requests YS Jagan 

(మల్యాల పళ్లం రాజు)

 

కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తిరుగులేని(వెనక్కి తీసుకోలేని) ప్రకటన చేసి, ఆంధ్ర ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో ముంచారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. అది కేంద్రం పరిధిలో అంశమని చెబుతూనే, తాను తప్పుడు హామీలు ఇవ్వనని, ఓ 55 మీటర్ల ఛాతీ విరుచుకున్నాడు. రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని, చెబుతూ, గతంలో కాపుల డిమాండ్ లను సమర్థించిన జగన్ మోహన్ రెడ్డి  ఒక్కసారి యూటర్న్ తీసుకున్నాడు. ఇది చారిత్రక తప్పిదమా సెల్ఫ్ గోలా, వ్యూహాత్మక ప్రకటనా అన్నది 2019 ఫలితాలలోనే తేలిపోవచ్చు.

 

జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో సాగించిన పాదయాత్రకు  గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర స్థాయిలో ప్రచారం రాలేదు. ప్రజాకర్షణ విషయంలోనూ సంతృప్తిగా సాగలేదు. గతంలో చంద్రబాబు పాదయాత్రతో పోల్చుకున్నా.. ఊహించిన ఫలితాలు సాధించి పెట్టే స్థాయిలో జగన్ యాత్ర ముందుకు సాగడం లేదు. అందుకే  ఓ సంచలనం కోసం ఈ ప్రకటన చేశాడా అని ఓ వర్గం వారు భావిస్తున్నారు.

 

రిజర్వేషన్ల చరిత్ర

 

కాపు రిజర్వేషన్లకు ఓ చరిత్ర ఉంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి అంటే బ్రిటీష్ హయాం నాటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఉన్నాయి.  మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కేవలం ఓ జీవోతో కాపు రిజర్వేషన్లను రద్దు చేశారు. అప్పట్లో నిరసనలను కూడా ఆయన పట్టించుకోలేదు.  1960 ప్రాంతంలో ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య తిరిగి ఓ జీవో ద్వారా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పునరుద్ధరించారు. అప్పట్లోనే ఓ కమిషన్ వేసి కమిషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అవసరమని చెప్పించి, పక్కాగా రిజర్వేషన్లు కల్పించి ఉంటే బాగుండేది.

ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి మళ్లీ మరో జీవోతో  కాపు రిజర్వేషన్లను తుంగలోకి తొక్కారు. కాపులకు రిజర్వేషన్లు అక్కరలేదనే భావన వ్యక్తం చేశారు. ఆ నాటి నుంచి రిజర్వేషన్ల కోసం కాపు సామాజికవర్గం ఆందోళనలు, డిమాండ్ లు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు ఈ ఆందోళన హింసాత్మకంగా కూడా మారింది(తుని). వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో కాపుల డిమాండ్ కు సానుకూలంగా స్పందించి, 2004 కాంగ్రెస్ ఎన్నికల మేని ఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చారు. తన హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించ గలిగారే తప్ప, వైఎస్ కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకు రావడంలో విఫలమైంది.

 

 చంద్రబాబు చతురత

 

2014లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాపు సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ను ఆకట్టుకునేందుకు తాజాగా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీ కమిషన్ వేసి, కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టినా, అమలులో నత్తనడక గానే సాగింది.

ముద్రగడ ఆధ్వర్యంలో కాపుల ఉద్యమం కారణంగానే, చంద్రబాబు దిగివచ్చి,జస్టిస్ మంజునాథ కమిషన్ వేసి కాపులను బీసీల జాబితాలోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో బీసీలనుంచి  పెద్దఎత్తున నిరసనలు తలెత్తడం తెలిసిందే.

కమిషన్ తుది నివేదిక ఇవ్వకపోయినా, అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం ఆమోదింపజేసి, కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు.

మరో పక్క కాపు ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి, ఓ వెయ్యి కోట్లు కేటాయించడమే కాక, వైఎస్ ఆర్ సీపీ కి చెందిన కీలక కాపు నాయకులకు గాలం వేసి, తమ పార్టీలో చేర్చుకుని, తమకు కాపు ఓట్ బ్యాంక్ దూరం కాకుండా యత్నించారు.

 

పవన్ పై కాపు యువత ఆశలు

 

మరో పక్క కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రంతో కాపు యువతరంలో కొత్త ఆశలు రేకెత్తాయి. పవన్ కల్యాణ్ తాను ఓ కులం నేతగా ముద్ర వేసుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే కాపు రిజర్వేషన్ల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించారు. నిజానికి  రిజర్వేషన్ల విధానానికి తాను వ్యతిరేకం అంటూ, అన్ని వర్గాలను ఆకట్టుకునే యత్నం చేశారు. అయినా, కాపు యువత పవన్ కల్యాణ్ ను తమనేతగా భావిస్తూ, వచ్చే ఎన్నికల్లో అతడిని ముఖ్యమంత్రిని చేయడానికి కంకణం కట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ను కొంత నిరాశ నిస్ఫృహలు ఆవహించి ఉండవచ్చు.  ఆంధ్రప్రదేశ్ లో కాపులు బలమైన సామాజిక వర్గమే, కానీ, ఆ సామాజిక వర్గం అటు తెలుగుదేశం వైపు కానీ, ఇటు పవన్ కల్యాణ్ జనసేన వైపు కానీ మొగ్గు చూపే అవకాశం ఉంది తప్ప, తన వెంట ఎంత మేరకు వస్తుందన్న సమీక్షలో పడ్డారు.

కాపు కులం సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా పరంగా కూడా  బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం నీడలోనే ఉన్న బలిజ, ఒంటరి వంటి ఉపకులాలు నిజానికి రిజర్వేషన్లు అవసరమైన స్థితిలో ఉన్నాయి. రాయలసీమ, నెల్లూరు ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న బలిజ, ఒంటరి సామాజిక వర్గాల ప్రజలు దమనీయమైన స్థితిలో ఉన్నారు. రిజర్వేషన్లు అవసరమైన ఆ వర్గాలకు చాలా సౌకర్యాలు దక్కకుండా కాపులు  పెద్దన్నయ్య తరహా వ్యవహరించి, ప్రయోజనాలు పొందడంతో ఈ ఉపకులాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రయోజనాలన్నీ, కాపు సామాజిక వర్గం యువకులే గంపగుత్తగా అందుకున్నారు తప్ప, ఈ ఉపకులాల పేదలకు దక్కినది శూన్యమే. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటన, ఇలాంటి కాపు సామాజిక ఉప కులాలకు కాస్త ఊరట కలిగించి ఉండవచ్చు.

 

జగన్ బీసీ తంత్రం

 

కాపు ఓట్ బ్యాంక్, అటు తెలుగుదేశం, ఇటు జనసేనకు తప్ప తనకు దక్కేది అరకొరే అని భావించిన జగన్ మోహన్ రెడ్డి  కాపు రిజర్వేషన్లను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బీసీలను తనవైపు తిప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ప్రకటన చేశాడని ఆ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు అసెంబ్లీ అంటే, రెడ్డి, కమ్మ, ఇతర అగ్రవర్ణాల మయసభ. బీసీలకు చోటులేదు. 1983లో  తెలుగుదేశం పార్టీ పెద్ద సంఖ్యలో బీసీలకు, ముఖ్యంగా యువతకు పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. అప్పటి నుంచి బీసీలు టీడీపీకి పెట్టని కోటగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పంచన రెడ్డి, ఇతర అగ్రకులాల దయాదాక్షిణ్యాలతో కొందరు పదవులు పొందినా,  బీసీలకు పెద్ద పీట వేసి, పదవులు ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలిపింది తెలుగుదేశం పార్టీయే. చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గాన్ని తమకు దీటుగా ప్రోత్సహించడం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని దూసుకువెళ్లడం, మంజునాథ కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం వంటి పరిణామాలతో బీసీలలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా, పార్టీని వీడే స్థాయికి చేరలేదు. చంద్రబాబు కూడా, బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తానని హామీ ఇస్తూ, బీసీలను బుజ్జగిస్తూవచ్చారు.

పార్టీకి దూరం కాకుండా కాపాడుకుంటూవచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల విషయంలో నిర్ద్వంద్వంగా ప్రకటన చేయడం ద్వారా, తాను బీసీలకు, వారి డిమాండ్ లకు పూర్తిగా అండగా నిలుస్తానని  చెప్పక చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కంగుతింది. తమ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కడ బీటలు వారుతుందేమో అన్న ఆందోళనకు గురవుతున్నది. అందుకే అపర రాజకీయ చాణక్యుడుగా పేరు మోసిన చంద్రబాబు జగన్ ప్రకటన పై ఎదురు దాడి చేసేందుకు, ఆ ప్రకటనను తమకు అనుకూలంగా మరల్చుకునేందుకు, అటు కాపులు, ఇటు బీసీ ఓట్ బ్యాంక్ ను కాపాడుకునేందుకు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.

అయితే, ఇంతకాలం టీడీపీకి అండగా ఉన్న బీసీలు జగన్ ప్రకటనతో అతడి వైపు ఏమేరకు మొగ్గుతారో 2019 ఎన్నికలే నిర్ణయించాలి. జగన్ ప్రకటన అద్భుతమైన రాజకీయ ఎత్తుగడా…. సెల్ఫ్ గోలా అన్నది అప్పుడే తేలనున్నది.

 

(మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్,హైదరాబాద్)