సచిన్, సింధియాలకు వైఎస్ జగన్ తో పోలిక లేదు ! 

YS Jagan, Sachin Pilot, Jotiraditya Scindia
ఇప్పటికి తాత్కాలికంగానో, శాశ్వతంగానో డెబ్బై ఏళ్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ గట్టెక్కి ఉండవచ్చు.  ఆయన ప్రభుత్వం మరికొంతకాలం కొనసాగవచ్చు.  కానీ, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే ఆయన ప్రభుత్వంలో అసమ్మతి చిచ్చు రేగిందంటే అది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న కుటిల రాజకీయాలకు ఉదాహరణగానే చెప్పుకోవాలి.  యువతరాన్ని ఏమాత్రం ప్రోత్సహించే ఆధునికతరం మనస్తత్వానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా చేరుకోలేదు. 
 
 
పదేళ్లక్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డిని చేతులారా దూరం చేసుకుని దానికి తగిన ఫలితాన్ని అనుభవించిన తరువాత….కొంతకాలం క్రితం మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు తరువాత కూడా కాంగ్రెస్ నాయకత్వం గుణపాఠం నేర్చుకోలేదు.  తలలు బోడిగుండ్లయి, పళ్ళు మొత్తం రాలిపోయి, దేహం ముడుతలు పడి, పది అడుగులు వేయాలంటే నలుగురు రెక్కలు పట్టుకుని తీసుకువెళ్లాల్సిన దుర్భరస్థితిలో…. మృత్యుదేవత కోరలకు చిక్కాడానికి సిద్ధంగా ఉన్న…కాటికి కాళ్ళు జాపుకున్న ముదివగ్గులను కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తుంది.  అందుకే పాతికేళ్ళక్రితం శరద్ పవార్ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాడు.  దాని ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అనుభవించింది.  
 
రాజస్తాన్ విషయానికి వస్తే సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.  రాహుల్ గాంధీకి కుడిభుజంగా మసిలాడు.  కేంద్ర మంత్రిగా సమర్ధవంతంగా పని చేశాడు.  అలాంటి నాయకుడి కుమారుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రజలను మెప్పించి, ఒప్పించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగాడు.  ముఖ్యంగా కేంద్రంలో సంపూర్ణ ఆధిక్యతతో అధికారంలో ఉన్న బీజేపీ రాజస్తాన్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని అధికారంలోనుంచి దించి కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకుని రావడంలో సచిన్ పైలెట్ పాత్ర, కృషి ఏమాత్రం విస్మరించరానిది.  సహజంగా తనను ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన ఊహించి ఉంటాడు.  కానీ, చివరి నిముషంలో అశోక్ గహ్లోట్  అధికారాన్ని తన్నుకుని పోవడం ఆయన హృదయాన్ని రగిలించి ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?  
 
 
ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు రాష్ట్ర పార్టీ పగ్గాలు తన చేతిలోనే ఉండాలని ప్రభుత్వాన్ని ఏర్పరచే ముందు సచిన్ పైలట్ షరతు విధించాడు.  దాన్ని పార్టీ అధిష్టానం ఆమోదించింది.   అయితే ఇటీవల తన ప్రభుత్వంలోని పోలీసులే తనకు నోటీసులు ఇవ్వడం సచిన్ పైలెట్ ను ఆగ్రహోదగ్రుడిని చేసింది.  ఫలితమే మొన్నటి తిరుగుబాటు.  అయితే కాంగ్రెస్ అధిదేవతలు జోక్యం చేసుకుని చచ్చీచెడీ పైలెట్ ను ఒప్పించారట.  చివరి నిముషంలో మెత్తబడ్డాడట.  అంతకుముందు ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది.  మధ్యప్రదేశ్, కర్ణాటకలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని చీల్చి బీజేపీ అధికారం చేపడుతుందని వార్తలు వచ్చాయి కానీ…అలా జరగకపోవడం కొంతలో కొంత నయం.
 
ప్రభుత్వం కూల్చివేతల పట్ల ఇప్పటికే భ్రష్టుపట్టిన బీజేపీ మరోసారి అలాంటి కుట్ర చేయబోయి భంగపడింది.  సచిన్ పైలెట్ బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయి బీజేపీలో చేరి ఉన్నట్లయితే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదే.  అప్పటికీ ఆదాయపు పన్ను అధికారులను కాంగ్రెస్ నాయకుల మీదకు ఉసిగొల్పి నికృష్ట రాజకీయాలకు బీజేపీ తెగించినప్పటికీ, చివరి నిముషంలో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా కాంగ్రెస్ తప్పించుకుంది.  
 
 
అయితే, ప్రస్తుతానికి సచిన్ పైలెట్ మెత్తబడినట్లు కనిపించినా, అశోక్ గెహ్లాట్ మెడమీద వేలాడుతున్న కత్తి తప్పుకుంటుందని నమ్మకం లేదు.  ప్రస్తుతం యువనేత అనిపించుకుంటున్న సచిన్ పైలెట్ అధిష్టానానికి  బానిసగా బతకాలనుకుంటే ఆయన చరిత్రను ముగించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టదు.  గులాం నబీ ఆజాద్, చిదంబరం, అహ్మద్ పటేల్  లాంటి ఇందిరాగాంధీ కాలానికి చెందిన వృద్ధతరం మర్యాదగా రాజకీయాలనుంచి తప్పుకుని, యువతరానికి నాయకత్వ బాధ్యతలను అప్పగించనంతకాలం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరమే.  
 
ఒకటి మాత్రం నిజం.  సింధియా, సచిన్, జగన్ సమవయస్కులు కావచ్చు….వీరి తండ్రులు అత్యంత శక్తిమంతులు కావచ్చు…కానీ, పులి కడుపున పులే పుడుతుందన్న సామెత ఒక్క జగన్ విషయంలోనే రుజువైంది.  సచిన్, సింధియాలకు అంత సీన్ లేదని అర్ధమైంది.        
 
రాజ్యం వీరభోజ్యం అని పెద్దలు చెప్పారు కదా! 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు