బహుశా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన పిదప శ్రీ బిశ్వభూషణ్ హరిచంద్ అతి క్లిష్టమైన సమస్యను పరిష్కరించే బాధ్యత తలపై వేసుకోబోతున్నారు. జగన్ ప్రభుత్వం ఆమోదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్ గవర్నర్ ఆఫీసుకు చేరింది. ఆయన దానిని ఆమోదిస్తే అది అమలులోకి వస్తుంది. ఆమోదించడమంటే అది గవర్నర్ స్వీయ విచక్షణ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం సంతకం పెడతారు అని మనం భావిస్తే మనను మనం వంచించుకోవడమే అవుతుంది. ఎందుకంటే గవర్నర్లు సొంతబుర్రతో ఆలోచించి విధులు నిర్వహించే పాతకాలపు రోజులు కావివి. కేంద్రపెద్దల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో గమనించి గవర్నర్లు తమ విధులను నిర్వహిస్తున్న రోజులివి. చాలామంది గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Read More : జగన్ సర్కార్ లెక్క కూడా గాడి తప్పుతోందా?
నా అంచనా ప్రకారం గవర్నర్ ముందు మూడు రకాలైన పరిష్కారాలు ఉన్నాయి. కేంద్ర పెద్దలు (అనగా ప్రధాని మోడీ), రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండి, వారిద్దరూ పాలూ నీళ్లలా కలిసి ఉన్న పక్షంలో బిల్ మీద గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేస్తారు. అలా కాకుండా మోడీ, జగన్ ల మధ్య అంటీముట్టని సంబంధాలు ఉంటే బిల్ ను ఆమోదించడంలో కొంతకాలం తాత్సారం చేస్తారు. ఇక మోడీ, జగన్ ల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా (అనగా మోడీ – మమతా బెనర్జీ మధ్య ఉన్నట్లు) ఉంటే మాత్రం ప్రభుత్వం పంపించిన బిల్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. గవర్నర్ ఏ చర్యా తీసుకోకుండా ఎంతకాలమైనా తొక్కిపెట్టినా, ప్రభుత్వం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ దాదాపు నాలుగు వందల లోక్ సభ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన పోస్టల్ బిల్లును అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ తాను పదవిలో ఉన్నంతకాలం ఆమోదించలేదు! రాజీవ్ గాంధీ ఏమీ చేయలేకపోయారు. జైల్ సింగ్ దిగిపోయిన తరువాత ఆ బిల్ కూడా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది.
Read More : తెలంగాణ బంద్ కు మావోల పిలుపు
అయితే జగన్ ప్రభుత్వం పంపించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అలాంటి గతి పడుతుందా అంటే పట్టదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. రాజధానికి సంబంధించిన ప్రతి అంశమూ మోడీ, అమిత్ షా లకు సమాచారం ఇచ్చే ముందుకు వెళ్తున్నామని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు అనేకమార్లు స్పష్టం చేశారు. ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం అంటే బీజేపీకి అంతో ఇంతో బలం ఉందనుకున్న ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల అభిమానాన్ని చేజేతులా కోల్పోవడమే అవుతుంది. పైగా రాజధాని ఎక్కడున్నా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వారికెలాగూ భవిష్యత్తులో ఏపీలో అధికారం వచ్చే ఆశలే లేవు. వారికి విశాఖ అయినా, ఒంగోలు అయినా, హిందూపూర్ అయినా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని వారు ఉన్న కాస్త ఓటు బ్యాంకును పోగొట్టుకుంటారని విశ్వసించలేము.
Read More : టాలీవుడ్ నుంచి బీకామ్ లో ఫిజిక్స్
ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబు నమ్మిన బంటులా పనిచేస్తూ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోవడమే కాక, నవ్వులపాలవుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా రాజధానిని కదిలించడానికి వీలు లేందంటూ ఇటీవల ఆయన పనిగట్టుకుని ముఖ్యమంత్రికి లేఖలమీద లేఖలు రాస్తూ కాగితాలను వృధా చేస్తున్నారు. ఒకప్పుడు బండారు దత్తాత్రేయ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ నూరు ఉత్తరాలు రాసి ఒక రికార్డును సొంతం చేసుకున్నారు. బహుశా కన్నా లక్ష్మీనారాయణ కూడా అలాగే రాసి “శతోత్తర లేఖా చింతామణి” అనే బిరుదు పొందాలని ప్రయత్నం చేస్తున్నారో ఏమో! ఎందుకంటే రాజధానిని అంగుళం కూడా అమరావతి దాటి పోనివ్వం అని లక్ష్మీనారాయణ గారు బల్ల గుద్ది మరీ చెబుతుంటే వారి కేంద్ర నాయకత్వ ప్రతినిధులు సునీల్ దేవధర్ మొన్న ఏడో తారీఖున విలేకరులతో మాట్లాడుతూ “రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రం ఇష్టం. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు” అని కుండబద్దలు కొట్టి చెప్పారు. మరి రాష్ట్రస్థాయిలో కన్నా లాంటివారు మరోవిధంగా ప్రవర్తిస్తూ చంద్రబాబు మెప్పు కోసం కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించడానికి సాహసిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వమే ఇలా రెండు నాలుకలతో రెండు రకాలుగా మాట్లాడిస్తున్నదా అని కొందరి సందేహం. అదే నిజమైతే రాష్ట్రం వరకు బీజేపీ తన శవపేటికను తానే తయారు చేసుకుంటున్నట్లే.
ఏమైనప్పటికీ, లోక్ సభలో ఇరవై రెండు మంది ఎంపీలు, రాజ్యసభలో ఆరుగురు ఎంపీల బలం ఉన్న వైసిపి ప్రతిపాదనలను కేంద్రం అంత తేలికగా తోసిపుచ్చుతుందని భావించలేము. జగన్ మనోరథమే అంతిమంగా పట్టాలకెక్కుతుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు