ఉగ్రవాదుల దాడుల్లో మన సి.ఆర్.పి.ఎఫ్. భద్రతా దళాల్లోని 37 మంది జవాన్లు మరణించారన్న దుర్వార్తతో గుండె తరుక్కు పోతున్నది. ఉగ్రవాదానికి అంతర్జాతీయ సమాజం సమాధి కట్టలేక పోతున్నదే, అన్న ఆవేదనే సామానుడిని వేదిస్తున్నది. ఏం జరుగుతున్నది కాశ్మీరులో అన్న ప్రశ్న దేశ పౌరులందరినీ కలచి వేస్తున్నది.
కాశ్మీర్ గడ్డపైనే తర్ఫీదు పొందిన ఉగ్రవాద ముష్కరులు ఇంతటి భారీ మారణహోమానికి పాల్పడగలరా? సరిహద్దులు దాటుకొని వచ్చిన కరడుగట్టిన, బాగా తర్ఫీదు పొందిన ఉగ్రవాదులే ఈ తరహా తీవ్రమైన నష్టాన్ని కలిగించ గలిగిన దాడులు చేయగలరన్నది నిస్సందేహం. మరి, ఉగ్రవాద కార్యకలాపాల నిఘా సంస్థలు, మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
‘సర్జికల్ స్ట్రైక్’ తో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని, అవినీతిని, నకిలీ నోట్లను అరికట్టడంతో పాటు టెర్రరిస్టులకు అక్రమ మార్గాల ద్వారా అందుతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసి ఉగ్రవాదం పీక నులమడమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేసినట్లు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గొప్పగా ప్రకటించు కొన్నారు.
భావజాల రీత్యా ఏ మాత్రం పొసగని పి.డి.పి. పార్టీతో కలిసి జమ్మూ & కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసి, మళ్ళీ, ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి, రాష్ట్రపతి పాల విధించి, నేడు కేంద్ర ప్రభుత్వమే పరోక్షంగా పాలన సాగిస్తున్నది.
ఈ నేపథ్యంలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడికి కేంద్ర ప్రభుత్వ ఘోర వైపల్యమే కారణమని చెప్పక తప్పదు. తాను అనుసరించిన, అమలు చేసిన అపసవ్యమైన, విధానాల దుష్పలితాలకు మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.
కాశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని, వారి భాగస్వామ్యంతో, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల సహకారంతో, అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టుకొంటూ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ సంకల్పంతో, చిత్తశుద్ధితో యుద్ద ప్రాతిపదికపై కార్యాచరణకు పూనుకొని, చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యకు హేతుబద్ధమైన, శాశ్వత పరిష్కారానికై పట్టుదలతో కృషి సల్పాలి.
“సర్జికల్ స్ట్రైక్స్” లాంటి సైనిక చర్యల ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని రుజువయ్యింది. యుద్ధం అభిలషణీయం కాదు, పరిష్కారం అంతకంటే కాదు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ అన్న ముసుగేసుకొని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దుందుడుకు చర్యలకు పూనుకొంటే వినాశనానికే దారి తీస్తుంది.
రాజకీయ పరిణతితో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజంతో కలిసి ఉమ్మడిగా రాజీలేని పోరాటం చేస్తూనే, జఠిలమైన కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా కార్యాచరణకు పూనుకోవాలి.
-టి.లక్ష్మీనారాయణ