పుల్వామా, బాలాకోట్, అభినందన్… బాలివుడ్ టైటిల్స్ కు పోటీ

పుల్వామా టెర్రరిస్టు దాడి తర్వాత దేశం మొత్తం కోపోద్రిక్తమయింది. ప్రతి భారతీయుడు పాకిస్తాన్ మీద అక్కసు వెలిగక్కుతున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలసిందేనంటున్నాడు. జైహింద్ నినాదం ప్రతిచోట తగిలిస్తున్నారు.

ఆ పైన ఫిబ్రవరి 26 భారతదేశంలోని ప్రతిఇంటికి జాతీయ పర్వదినమా అన్నట్లు తయారయింది. ఆ రోజు తెల్లవారు జామున బాలాకోట్ మీద భారతీయ వాయుసేన జరిపిన దాడితో దేశం యావత్తు ఊర్రూత లూగింది. భారత్ సింహం అన్నారు, టైగర్ అన్నారు. నిద్రిస్తున్న పులిని లేపారన్నారు.

ఈ లోపు భారతీయుల్లో దేశ భక్తిని ఇంకా ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోతూ, వింగ్ కమాండర్ భారత పైలటొకరిని పాక్ పట్టుకుంది. పాక్ చేతికి చిక్కిన భారతీయ పైలట్ పేరు అభినందన్ అని తేలగానే భారతీయు యువకుల్లో పాక్ ప్రతీకారేచ్ఛ రెట్టింపయింది. అభినందన్ని కొట్టారని దేశం కోపోద్రిక్తమయింది. అభినందన్ లో భారతీయ యువకులు కొత్త హీరోని చూశారు.

అపైన భారత ప్రధాని అభినందన్ ని క్షేమంగా వెనక్కి పంపాలని వార్నింగ్ఇచ్చారు. అంతలోనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ ని శుక్రవారం విడుదల చేస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం ‘అభినందన్’ విడుదల సూపర్ హిట్ అయింది….

ఈ ధీమ్ లన్నింటిని నిజంగా సూపర్ హిట్ చేసుకోవాలనుకుంటున్నారు బాలివుడ్ నిర్మాతలు.ఇప్పటికే దేశభక్తి సినిమాలు సూపర్ హిట్టయి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ పరపంరలో  ‘యూరి’ తాజా విజయం. ఆ మధ్య ఈ సినిమా చూస్తూ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా బెంగూళూరు థియోటర్లో లేచినిలబడి నినాదాలిచ్చారు.

దేశభక్తి బాగా అమ్ముడుపోయే స్క్రిప్ట్ అని బాలివుడ్ నిర్మాతలు గుర్తించారు. అందుకే ఫుల్వామ పర్యవాసానాల మీద సినిమా టైటిల్స్ రిజస్ట్రేషన్ కోసం తెగ పోటీ పడుతున్నారు. ముంబై లోని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IIMPA)కార్యాలయం ఇపుడు పాత ప్రొడ్యూసర్లతో, కొత్త ప్రొడ్యూసర్లతో, ప్రొడ్యూ సర్లు కావాలనుకునే ఔత్సాహికులతో, ఫేక్ ప్రొడ్యూసర్లతో కిటకిటలాడుతూ ఉందని వార్తలొస్తున్నాయ్. వీళ్లంత పైన పేర్కొన్న ధీమ్స్ మీద సినిమా టైటిల్స్ ని రిజిస్టర్ చేయించుకునేందుకు అక్కడ తోసుకుంటున్న వాళ్లు.తెలివైనోళ్లు ఇంకా బార్డర్ లో టెన్షన్ కొనసాగుతున్నపుడే కొన్ని టైటిల్స్  రిజిస్టర్  చేసుకున్నారు. పుల్వామా: ది డెడ్లీ ఎటాక్ అని ఒక టైటిల్ అపుడే రిజస్టర్ అయింది. ఐఎంఎంపిఎ ముందుకొచ్చిన కొన్ని టైటిల్స్ ఇలా ఉన్నాయ్.  పుల్వామా వెర్సెస్ సర్జికల్ స్ట్రైక్ 2.0, పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్ 2.0, IAF, బాలాకోట్, ఎయిర్ ఫోర్స్ పైలట్, అభినందన్ వర్థమాన్… ఈ మధ్య దేశానికి ఎదురయిన విషాదాన్ని ఇలా రకరకాల పేర్లతో సొమ్ముచేసుకునేందుకు బాలివుడ్ తెగ తంటాలు పడుతూ ఉంది.

ఫిబ్రవరి 26న బాలకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ జరగ్గానే పశ్చిమ ముంబై అంధేరీలో ఉన్న IMMPA కార్యాలయంలో అయిదు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు పచ్చి జాతీయ వాద టైటిల్స్ ను రిజర్వు చేసుకున్నాయని హఫింగ్టన్ పోస్టు రాసింది. ఇపుడు చెలరేగుతున్న జాతీయ భావం, పాక్ వ్యతిరేకత నేపథ్యంలో చిన్న, పెద్ద, ఫేక్ నిర్మాతలంతా ఇలా జాతీయాభిమాన టైటిల్స్ కోసం ఎగబడటానికి కారణం, ఈ సినిమాల్లో డబ్బు పెడితే, కచ్చితంతా రాబడి ఉంటుందన్న నమ్మకమే.

పుల్వామా, బాలకోట్, సర్జికల్ స్ట్రయిక్ 2.0, పుల్వామా ఎటాక్ టైటిల్స్ అపుడే రిజస్టర్ అయిపోయాయి. ఈ టైటిల్స్ కోసం నిర్మాతలు పోటీ పడ్డారని అంధేరీ కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు. రిజస్ట్రేషన్ కోసం పోటీ పడుతున్న టైటిల్స్ లో హిందూస్థాన్ హమారా హై, పుల్వామా టెర్రర్ ఎటాక్, ది అటాక్స్ ఆఫ్ పుల్వామా.వింగ్ కమాండర్, వింగ్ కమాండర్ అభినందన్ వగైరాల ఉన్నాయని హఫింగ్టన్ పోస్టు రాసింది. బాలాకోట్, పుల్వామా దాడులకు సంబంధించిన టైటిల్స్ ను ఎబండాన్సియా, టి సిరీస్ రిజర్వే చేసుకున్నట్లు IMMPA ప్రతినిధి ఒకరు చెప్పారు.

టైటిల్ రిజిస్టర్ చేసుకోవడం ఏమంత కష్టం కాదు. నాలుగయిదు ప్రత్యామ్నాయ టైటిల్స్ తో మన ప్రాధాన్యత పరంగా ఒక ఫామ్ నింపాలి. దీనికి రుసుం రు. 250 , జిఎస్ టి అదనం.

రిజిస్టర్ చేసుకుంటే సినిమా కచ్చితంగా తీయాలని రూలేం లేదు. టైటిల్ బాగుంటే కోటో రెండు కోట్లో పెట్టి ఎవరయినా కొన వచ్చు. టైటిల్స్ రేటు ఎంత ఉంటుందో ఈ మధ్య జరిగిన సంఘటన ఒక సాక్ష్యం.

ప్రీతిష్ నంది, అనురాగ్ కాష్యప్ కి ఈ మధ్య ఒక టైటిల్ విషయంలో బేరసారాలు సాగాయి. వుమానియా (Womania) అనేది టైటిల్. దీనిని ప్రీతిష్ నంది రిజిస్టర్ చేసుకున్నారు. కాష్యప్ ఇద్దరు మహిళా షార్ప్ షూటర్స్ మీద సినిమా తీయాలనుకుంటున్నారు. ఆయన ఈ టైటిల్ నచ్చింది. కాష్యప్ కు ఈ టైటిల్ అవసరమని తెలుసుకున్న నంది టైటిల్ ధర రెండుకోట్ల ని చెప్పాడట. ఈ ధరకు కాష్యప్ షాక్ తిని ఇదేదో రౌడీ మామూలు (extortion) లాగా ఉందని సాంద్ కి ఆంఖ్ అని టైటిల్ సర్దుకు పోవాలనుకున్నాడు.

వీర దేశభక్తి, వీర పాక్ వ్యతిరేకత నూరిపోసే టైటిల్స్ కి ఇలా గిరాకి ఉండటానికి కారణం ఈ రేటే.