చైనా మీద భారత్ సర్జికల్ స్ట్రయిక్స్.. ప్రసక్తే లేదు 

లడక్ గాల్వాన్ లోయలో భారత సైన్యంపై చైనా బలగాల కుట్ర పూరిత దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందటం దేశాన్ని కుదిపేసింది.  కొన్ని నెలలుగా లద్దాఖ్ సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చిన చైనా సైన్యం ఒక్కసారిగా దాడి చేసి 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకోవడంతో దేశ ప్రజల్లో ఆవేశం మిన్నంటింది.  చైనా దూకుడుకు కళ్లెం వేసి తీరాల్సిందేనని దేశ ప్రజలు పట్టుబట్టారు.  ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని, సత్వర చర్యలు ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  దీంతో మోదీ అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకెళ్లాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ నేపథ్యంలో భారత్ చైనా మీద సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినబడ్డాయి.  జాతీయ మీడియా సైతం సర్జికల్ స్ట్రయిక్స్ జరగొచ్చనే తరహాలో కథనాలు ప్రసారం చేయడంతో దేశ ప్రజల్లో నిజంగానే భారత్ చైనా మీద దాడికి దిగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.  కానీ ప్రస్తుత పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే అలాంటి అవకాశమే లేదని స్పష్టమవుతోంది.  ప్రపంచ దేశాల్లోని రెండు అగ్రగామి దేశాలైన భారత్, చైనాలు పరస్పర సైనిక దాడులకు దిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.  ప్రపంచ దేశాలన్నీ ఈ వివాదంలో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది.  ఇది దేశ సార్వభౌమత్వానికే చేటు చేయవచ్చు.  
 
ఈ సంగతి భాజాపా ప్రభుత్వానికి బాగా తెలుసు.  ఈ సమస్యను సున్నితంగా డీల్ చేయాలని కూడా మోదీకి ఎరుకే.  అందుకే మోదీ, అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మొదటి నుండి చాలా చాకచక్యంగా మాట్లాడుతూ వచ్చారు.  పరిస్థితులను పరిశీలిస్తున్నామని, చైనా దూకుడును కట్టడి చేస్తామని, మన భూభాగం అంగుళం కూడా చైనా ఆధీనంలోకి వెళ్ళదని అంటున్నారే తప్ప ఎక్కడా కూడా దాడులు చేస్తామన్నట్టు మాట్లాడలేదు.  ఇక ఆల్ పార్టీ మీటింగ్ కూడా దేశ ప్రజల్లో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడం కోసం, ప్రతిపక్షాలను శాంతిపజేయడం కోసమే.  అంతేకానీ ఈ మీటింగ్  దాడులకు పథక రచన ఏమాత్రం కాదు. 
 
అసలు గతంలో పాక్ మీద చేసిన బాలాకోట్ దాడులు, ఆక్రమిత కాశ్మీర్లో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్  చూపిస్తూ చైనా మీద దాడులు జరుగుతాయని అనుకోకూడదు.  ఎందుకంటే బాలాకోట్ దాడులు పాక్ సైన్యం మీద లేదా పాక్ భూభాగం మీద జరిపినవి కావు.  కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద జరిపిన దాడులు.  ఈ విషయాన్ని దాడుల సమయంలో భాజాపా ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.  ఇక సర్జికల్ స్ట్రయిక్స్ కూడా ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల మీద జరిపినవే తప్ప పాక్ మీద జరిగిన సైనిన చర్య కాదు.  కాబట్టి పాకిస్థాన్ మీద లేదా పాక్ సైన్యం మీద ఇండియా ఏ సైనిక దాడులకు పాల్పడలేదు.  
 
అసలు పాక్ – ఇండియా మధ్య పరిస్థితులు, ఇండియా – చైనా నడుమ పరిస్థితులకు చాలా తేడా ఉంది.  పాక్ భూభాగంలో దాడులకు ఉగ్రవాదం అనే రీజన్ ఉంది.  అలాంటి ఉగ్రవాదం చైనాలో లేదు.  కనుక భారత్ దాడులు జరిపితే అవి చైనా సైన్యం మీద జరిపినట్టే అవుతుంది.  అలా జరిగితే ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపే వేలెత్తి చూపుతాయి.  శాంతియుత వాతావరణం కోరుకునే భారత్  అలాంటి పొరపాటు చేయదు కూడ.  అంతేకాదు ఇండియా, చైనా మధ్య భారీ వాణిజ్య సంబంధాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని శాంతియుత పరిష్కారానికే వెళుతుంది.  
 
ఇక చైనా విషయానికోస్తే ఆ దేశం కూడా ఈ వివాదాన్ని శాంతి మార్గంలోనే పరిష్కరించాలని అనుకుంటోంది.  అందుకే గాల్వాన్ దాడి సమయంలో బంధీలుగా చేసుకున్న 10 మంది భారత సైనికులను ఎలాంటి చర్చలు లేకుండానే ఇండియాకు అప్పగించింది.  అలాగే దాడులకు ముందే షెడ్యూల్ అయిన ఇండియా, చైనా, రష్యా సమ్మిట్ దాడుల నేపథ్యంలో వాయిదాపడుతుందని అనుకున్నారు.  కానీ అలా జరగలేదు.  ఈ సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి హాజరుకానున్నారు.  సో.. ఇరు దేశాలు శాంతి పూర్వకంగానే ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.  అదే సరైన పరిష్కారం కూడ.  అంతేకానీ టిఆర్పీల కోసం కొన్ని మీడియా సంస్థలు ఊదరగొట్టినట్టు చైనా మీద భారత్ సర్జికల్ స్ట్రయిక్ తరహా దాడులు చేయాలనే యోచనలో ఉందనేది పూర్తిగా అవాస్తవం, అసంభవం.