ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కల్యాణ్ కు ముద్రగడ రూపంలో సొంతనియోజకవర్గంలోనే పెద్ద షాక్ తగిలింది. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ అన్నారో.. లేక, విషయం గ్రహించి చెప్పారో.. అదీ గాక జనసేన నేతలే ఆమేరకు జనసైనికులకు హింట్ ఇచ్చారో తెలియదు కానీ… జోగయ్య నోటి నుంచి ఒక మూడు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ అభిమానులు.. జనసైనికులతో పాటుగా ఇతర పార్టీనేతలు సైతం తెలుసుకోవాలనుకుంటున్న విషయాల్లో ప్రధానమైనది జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం ఏది అనే విషయం. ఈ విషయం కన్ ఫాం అయిపోతే ప్రచారాలు షురూ చేద్దాం అని జనసైనికులు భావిస్తుండగా.. అది చంద్రబాబు చేతిలో ఉందని టీడీపీ కార్యకర్తలు చెబుతుండగా… ఆ విషయం తెలిస్తే వ్యూహాలు స్టార్ట్ చేయొచ్చని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలో పవన్ సీఎం కావాలని తొలి నుంచి కోరుకుంటూ.. పవన్ అడిగినా అడగకపోయినా అండగా నిలుస్తున్నట్లు ప్రవర్తించే మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేసారు. ఈ సందర్భంగా పవన్.. పశ్చిమ గోదావరిలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలంటూ మూడు నియోజకవర్గాలను సూచించారు.
అవును… వచ్చే ఎన్నికల్లో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారని జోగయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని సామెత చందంగా… భీమవరం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో మిగిలిన రెండు నియోజకవర్గాల విషయంలో… నరసాపురం నియోజకవర్గం కొణిదెల కుటుంబంకు సొంత నియోజకవర్గం అని చెప్పిన అయన.. 2009లో పిఆర్పీ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. కాబట్టి… 2024లో ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానం నుంచి పోటీచేయాలని లేఖలో కోరారు.
అయితే… నిన్నమొన్నటివరకూ పవన్ కు పిఠాపురం నుంచి కానీ ప్రత్తిపాడు నుంచి కానీ పోటీచేయాలని బలంగా ఫిక్సయ్యారని కథనాలొచ్చాయి. పవన్ కూడా అలాంటి సంకేతాలు ఇచ్చారు! ఈ సమయంలో ముద్రగడ నుంచి పవన్ కు భారీ షాక్ తగలడంతో పవన్ ఆ ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాలను సూచిస్తున్నారు జోగయ్య.