శ్రీకాకుళం జిల్లా టెక్కలి రాజకీయాలు ఎప్పుడూ వివాదాస్పదమే. వర్గపోరు, వ్యక్తిగత ఆధిపత్య పోరాటాలు ఈ నియోజకవర్గాన్ని వీడడం లేదు. వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, దివ్వెల మాధురిల మధ్య తలెత్తిన విబేధాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. 2019 ఎన్నికల నుంచి ఈ గ్రూప్ రగడ ఆగకపోవడం వైసీపీకి మైనస్‌గా మారింది. ప్రస్తుతం మూడుగా విడిపోయిన టెక్కలి వైసీపీలో నేతల మధ్య అవగాహన కరవు పరిస్థితిని మరింత కష్టతరం చేసింది.
అధికారానికి దూరమైన తర్వాత, టెక్కలి వర్గ పోరాటాలు కొత్త మలుపు తిప్పాయి. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన ఓటమికి పేరాడ తిలక్ కారణమని ఆరోపించడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పరిస్థితిని మరింత పెచింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా సొంత గ్రూప్ ఏర్పాటు చేసి పోటీని మరింత వేడెక్కించడంతో, వైసీపీ అధిష్టానం పరిస్థితి దయనీయంగా మారింది.
పార్టీ సెట్ చేసే ప్రయత్నాల్లో టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను తిరిగి తిలక్‌కు అప్పగించడం, శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేయడం గ్రూప్‌ల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో దివ్వెల మాధురి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రత్యేక కార్యక్రమాలు టెక్కలి రాజకీయాలను హాట్‌టాపిక్‌గా మార్చాయి. “దమ్ముంటే టికెట్ తెచ్చుకో” అంటూ మాధురి చేసిన పోస్ట్ స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇలాంటి పరిస్థితుల్లో టెక్కలి వైసీపీ క్యాడర్ భయభ్రాంతులకు గురవుతోంది. గ్రూప్‌ల మధ్య పోరుతో పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం త్వరగా జోక్యం చేసుకోకపోతే, ఈ వర్గపోరు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.