ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు అనేది కన్ ఫాం.. ఎన్నికలకు మూడు నెలల ముందు ఈ విషయం స్పష్టం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో బీజేపీ సంగతి కాసేపు పక్కనపెడితే… జనసేన, టీడీపీలు ఒంటరిగా పోటీచేసే సాహసం చేయవనేది వారి అభిప్రాయంగా ఉంది. పవన్, చంద్రబాబు కూడా ఒక అండర్ స్టాండింగ్ తోనే యాత్రలు, పర్యటనలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా జనసైనికులతా జనసేన ప్రభుత్వం వచ్చేస్తోందనే ఊహల్లో విహరిస్తున్నారని అంటున్నారు. ఇక టీవీ డిబేట్లలో పాల్గొనే జనసేన నేతలు.. రాబోయేది జనసేన ప్రభుత్వమే అని అంటున్నారు. పవన్ కల్యానేమో… తాను సీఎం అభ్యర్థిని కాదని, ఏదో జనసైనికుల తృప్తి కోసం అలా వారిని ఆత్మవంచనకు గురిచేస్తుంటానని పరోక్షంగా చెబుతున్నారు.
మరోపక్క ప్రతీ సభలోనూ ఒక చిన్న సైజు మేనిఫెస్టోని ప్రకటిస్తున్నారు. రకరకాల సామాజికవర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. వారికి ఇవ్వాల్సిన ఎన్నికల వాగ్ధానాలు చేస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. తాను ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ తన ఆలోచనలు అంటూ ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు.
అంటే… జనసేన – టీడీపీ కచ్చితంగా కలిసే ఎన్నికల్లో పోటీచేయ్యవు అన్నట్లుగా చెబుతున్నారా… లేక, పొత్తులో భాగంగా తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పదలుచుకున్నారా… అన్నది పవన్ కి చంద్రబాబు కి తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేకపోవచ్చు.
ఈ పరిస్థితుల్లో మైకులముందుకు వచ్చిన గంటా శ్రీనివాస రావు… ఎన్నికలు ఎపుడు వచ్చినా చంద్రబాబే సీఎం అని జోస్యం చెబుతున్నారు. దీంతో… టీడీపీ ఒంటరిగా పోటీచేస్తుందా అని జనసైనికులు స్పందిస్తున్నారు. పొత్తు ఉందో లేదో స్పష్టత లేకుండా… ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలా కన్ ఫాం చేస్తారనేది వారి అభిప్రాయం. మరో పక్క మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇదే మాట చెబుతున్నారు. ఆరు నెలలు ఓపిక పడితే తానే కొత్త హోం మంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.
దీంతో జనసైనికులు రగిలిపోతున్నారు. పొత్తు లేనప్పుడే ఇలాంటి ఆలోచనలు చేయాలని… పొత్తు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు అనే విషయాలపై కూడా స్పందించడం సరైన చర్య కాదని ఫైరవుతున్నారు.
కానీ… టీడీపీ కార్యకర్తలు మాత్రం ఈ మాటలతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. విడి విడిగా పోటీ చేసి తమ ఆధిపత్యం చూపించాలని తపిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అవసరమైతే తప్ప లేకపోతే పవన్ సహాయం తీసుకోకూడదని.. తర్వాత దెప్పిపొడుపు మాటలు బరించాల్సిన అవసరం రాదని వారు అంటున్నారు.
మరి ప్రజలను, కార్యకర్తలను ఫుల్ కన్ ఫ్యూజన్ లో పెట్టడంలో పూర్తిగా సక్సెస్ అవుతున్న జనసేన అధినేత పవన్ తో ఇప్పుడు టీడీపీ సీనియర్లు కూడా జతకలిసినట్లున్నారనే కామెంట్లు చేస్తున్నారు పరిశీలకులు.