ఉచితమా.? అనుచితమా.? ఏది సంక్షేమం.?

సంక్షేమ పథకాల్ని ‘ఉచితం – అనుచితం’ అన్న కోణాల్లో చూడొద్దన్నది వైసీపీ పదే పదే చెబుతున్నమాట.! అసలు సంక్షేమం అంటే ఏంటి.? సంక్షేమ పథకాల వల్ల ఏం ప్రయోజనం.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఇది ఎంతో కాలంగా జరుగుతున్న చర్చ. నిజానికి, సంక్షేమ పథకాలపై జనానికీ ఖచ్చితమైన అవగాహన వుంది.

‘చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా.. ఇంకొకరైనా.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే.. అంతకు మించిన సంక్షేమం కావాలి..’ అని మెజార్టీ ఓటర్లు ఆశిస్తారు. ఇక్కడ ‘మెజార్టీ ఓటర్లు’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, అందరూ సంక్షేమాన్ని కోరుకోరు గనుక.!

ఈ రోజుల్లో సంక్షేమం అంటే.. అప్పు చేయడమే.! ఒకప్పటి పరిస్థితి వేరు. అభివృద్ధి జరిగేది.. తద్వారా పెరిగే సంపదతో, సంక్షేమం అమలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. అభివృద్ధి కోసం అప్పు అనేది మంచిదే. కానీ, సంక్షేమం కోసం అప్పు.. అంటే, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి లేదా వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పు చేయక తప్పదు.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం గురించి ఏమనుకుంటున్నారు.? ఓ సర్వే ప్రకారం చూస్తే, ‘ఎవరు అధికారంలో వున్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయ్. అంతకు మించిన స్థాయిలో సంక్షేమ పథకాలు వస్తాయ్.. మేం అడిగినా, అడగకపోయినా రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తాయి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయ్..’ అని జనంలో ఖచ్చితమైన అభిప్రాయం వుంది.

సంక్షేమ పథకాల్ని చూసి ఓట్లేస్తారా.? అంటే, అప్పటి పరిస్థితుల్ని బట్టి ఓటు వేయాలా.? వద్దా.? అన్నది అప్పటికప్పుడు నిర్ణయమవుతుంది తప్ప, సంక్షేమ పథకాల్ని చూసి ఓట్లెయ్యడం అనేది జరగదన్నది మెజార్టీ వాదన.