సర్పంచ్ ఎన్నికల్లో దొంగనోట్లు కలకలం.. ఓటుకు డబ్బు తీసుకున్న గ్రామస్థుల్లో భయం..!

ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశ చివరకు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే స్థాయికి తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో తాజాగా బయటపడిన నకిలీ నోట్ల వ్యవహారం స్థానిక రాజకీయాలను షేక్ చేసింది. సర్పంచ్ ఎన్నికల వేడి మధ్యలో ఓటర్ల చేతికి వెళ్లిన దొంగనోట్లు ఇప్పుడు గ్రామాన్ని గుబులు గుబులుగా మార్చాయి.

జలాల్‌పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు తన పంట రుణం చెల్లించేందుకు కెనరా బ్యాంక్‌కు వెళ్లాడు. కౌంటర్ వద్ద డబ్బులు ఇచ్చిన క్షణమే బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది. నోట్లను జాగ్రత్తగా పరిశీలించగా అవి అసలైనవి కాదని తేలింది. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల తనిఖీలో రైతు వద్ద ఉన్న మొత్తం రూ.2,08,500 నగదులో 417 రూ.500 నోట్లు నకిలీవని నిర్ధారణ అయింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మరింత సంచలన విషయం బయటపడింది. ఈ నకిలీ నోట్లు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఓ అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఓటుకు డబ్బుల ఆశ చూపిన అభ్యర్థి చేతుల్లో దొంగనోట్లు రావడంతో గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు.

డబ్బులు తీసుకున్న ఓటర్లు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. నోట్లు తీసుకున్నందుకు తమపై కేసులు పడతాయా.. అన్న సందేహంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎన్నికల్లోనే దొంగనోట్లు చలామణి కావడం ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ నోట్ల దందాకు రాజకీయ రంగు పులుముకోవడం ప్రమాదకరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఘటనతో వర్ని మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. పోలీసులు నకిలీ నోట్ల మూలాలు, వాటిని ముద్రించిన వారు ఎవరు, ఎలా చలామణిలోకి వచ్చాయన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బయటపడిన ఈ నకిలీ నోట్ల వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.