సీఎం వైఎస్ జగన్‌కి డ్యామేజీ కంట్రోల్ సాధ్యమేనా.?

Damage Control Possible for YS Jagan?

ముమ్మాటికీ ఇది సలహాదారుల వైఫల్యమే. ఆ మాటకొస్తే, ఇది పాలనా వైఫల్యం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని వ్యతిరేకిస్తే ఏమవుతుంది.? కులం పేరుతో ఎస్ఈసీని దూషిస్తే ఏమవుతుంది.? అన్న విషయాలపై అధికార పక్షం ఇప్పటికైనా కళ్ళ తెరవాల్సి వుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ‘వాస్తవాన్ని మేం చూడలేం’ అని అధికార పార్టీ నేతలు ఇంకా అనుకూంటూ, కళ్ళు మూసుకుని వుంటామంటే.. ముందు ముందు మరిన్ని సమస్యలు తప్పవు. ‘ముఖ్యమంత్రి ఎవరు.? నేనా.? ఆయనా.?’ అంటూ ఎస్ఈసీ మీద విరుచుకుపడ్డంలోనే వైఎస్ జగన్ తప్పటడుగులు వేశారు. నిజానికి, ఆ సమయంలోనే ఆయన కాస్త సంయమనం పాటించి వుంటే బావుండేది. గోటితో పోయేదానికి.. గొడ్డలి వేటు దాకా తీసుకొచ్చారు. తీరా ఆ వేటు, ఇప్పుడు తమ మీదే పడింది. ‘పంచాయితీ ఎన్నికలు జరగడానికి వీల్లేదు..’ అని నినదించిన అధికార వైసీపీ, సుప్రీం కోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు తప్పనిసరైన దరిమిలా.. ఎన్నికల బరిలోకి దిగుతుందా.? లేదా.? దిగితే.. పరువు పోతుంది. దిగకపోతే, ప్రత్యర్థి పార్టీలకు బలం పెరుగుతుంది. ఇప్పడు ఏం చేయాలి.?

Damage Control Possible for YS Jagan?

ఏమీ, చేయలేని పరిస్థితి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. హైకోర్టు తీర్పుతో అయినా, ప్రభుత్వ పెద్దలు తేరుకుని వుంటే బావుండేది. ఇలాంటి కేసులు గతంలో చాలానే న్యాయస్థానాల్లో వీగిపోయిన దరిమిలా, న్యాయ నిపుణులు ప్రభుత్వ పెద్దలకు సరైన రీతిలో దిశా నిర్దేశం చేసి వుండాలి. బోల్డంతమంది సలహాదారులున్నారు.. అధికార యంత్రాంగం చేతిలో వుంది. అయినాగానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో ‘తాడో పేడో..’ తేల్చుకోవడానికే సిద్ధమయ్యారు. ఇప్పుడు, గెలుపు ఎస్ఈసీది అయ్యింది. నిజానికి, ఎస్ఈసీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యర్థి అవడం అస్సలేమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. కానీ, జరిగింది. పంతాలకు పోవాల్సిన పనిలేదు. ఇదొక గుణపాఠం. డ్యమేజీ కంట్రోల్ చర్యలకు ముఖ్యమంత్రి ఉపక్రమించాల్సిందే.. వేరే దారి లేదు. సలహాదారుల వ్యవస్థను ప్రక్షాళన చేయడంతోపాటు.. కీలక చర్యలు తీసుకుంటే తప్ప.. డ్యామేజీ కంట్రోల్ జరగదు.