ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా… ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి ఎన్నికల్లోకి వెళ్లాలని, 2014 ఫలితాలు రిపీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. చంద్రబాబు సైతం ఇదే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కాస్త పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నా… పవన్ మాత్రం అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
ఈ సమయంలో తెరపైకి వచ్చారు సీపీఐ నారాయణ. తమతో కలిసి నడవమని చంద్రబాబు – పవన్ లను తనస్టైల్ లో రిక్వస్ట్ చేస్తున్నారు! అందుకు ఆయన ఎంచుకున్న మార్గం… రాబోయే ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి ప్రయాణిస్తే గెలిచేది వైసీపీనే అని చెబుతున్నారు. దానికి ఆయన చెప్పే కారణం… దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరిగిపోతుందని. ఆ ఎఫెక్ట్ ఏపీపై పడుతుందని.. ఫలితంగా ఈ పొత్తు చిత్తవుతుందని.
ఇలా బెదిరించిన నారాయణ… టీడీపీ – జనసేనలు తమతో పొత్తు పెట్టుకుని ముందుకువెళ్లడం మంచిదని పరోక్షంగా సూచిస్తున్నారన్నమాట. ప్రస్తుతానికి ఏపీలో మనుగడ ప్రశ్నార్ధకంగా ఉన్న కమ్యునిస్టు పార్టీల్లో కాస్త కదలిక తెచ్చి, వెంటిలేటర్ పై నుంచి లేపుదామని నారాయణ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారన్నమాట. అయితే అసలే పరిస్థితులు బాగోలేదని, జాతీయ స్థాయి పార్టీ అండదండలు ఉండాలని చంద్రబాబు… మోడీ భజన చేస్తుంటే… మధ్యలో నారాయణ ఎంటరై బాబు ప్లాన్ ని దెబ్బకొడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
మరి నారాయణ తన స్టైల్లో ఇచ్చిన ఈ సూచనను చంద్రబాబు – పవన్ లు పరిగణలోకి తీసుకుంటారా.. లేక, లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!