చంద్రన్న మేనిఫెస్టో.! నవ్విపోదురుగాక.!

రైతులకు సాయమట.! అది ఏడాదికి 20 వేలట.! ప్రతి మహిళకీ ఏడాదికి 15 వేల రూపాయలట. 18 ఏళ్ళు పైబడి 59 ఏళ్ళ లోబడి వున్న ఆడ బిడ్డలకు నెలకు 1500 రూపాయలట.! కుటుంబానికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితమట. నిరుద్యోగ బృతి కింద నెలకు మూడు వేల రూపాయలట.!

2024 ఎన్నికల్ని దృష్టిలోపెట్టుకుని, పాక్షిక మేనిఫెస్టోని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించేశారు. ‘సంపదను ఎలా సృష్టించాలో నాకు తెలుసు.. అభివృద్ధి చేసి, సంపదను సృష్టించి.. సంక్షేమ పథకాల్ని అమలు చేస్తాను..’ అని చంద్రబాబు, మహానాడు వేదికగా చెప్పుకొచ్చారు.

అన్నట్టు, మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కూడా ఉచితంగానే చేసే అవకాశం ఇవ్వబోతోందట టీడీపీ ప్రభుత్వం.! సరిపోయింది సంబరం.!

వందల కోట్లు కాదు, వేల కోట్లు కావాలి.. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి. ఇప్పటికే రాష్ట్రం సంక్షేమ పథకాల కారణంగా భ్రష్ట్టుపట్టిపోయింది. పని చేయడానికి జనం ఇష్టపడని దుస్థితి దాపురించింది. ఇకపై పూర్తిగా సోమరులైపోవచ్చన్నమాట.! ఇదీ జన బాహుళ్యంలోనూ జరుగుతున్న చర్చ.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని వైపరీత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనిపిస్తోందేమో. రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. ఇవేవీ అవసరం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు.! ఇక, ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్తులో బాగుపడదు.!