TDP Deepak Reddy: టీడీపీ దీపక్ రెడ్డి వెనుక వైఎస్ జగన్ ఉన్నారా?

TDP Deepak Reddy: ఇండిగో విమానాలు ఆగిపోవడం సంగతి అటుంచితే, దాని వల్ల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ వ్యవహారం మాత్రం టీడీపీలో సరికొత్త చర్చకు దారి తీసిందనే కామెంట్లకు మాత్రం కారణమైంది. ప్రధానంగా జాతీయస్థాయిలో తెలుగుదేశంపార్టీని, రాష్ట్ర మంత్రి లోకేష్ ని, కేంద్రమంత్రి రామ్మోహన్ ని బద్నాం చేశారనే చర్చ బలంగా మొదలైంది.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా…

ఈ వ్యవహారంలో లోకేష్ ని ఎంటర్ చేసి కావాలనే బద్నాం చేశారా?

ఇండిగో విషయలో తనకు సంబంధం లేదని చంద్రబాబు తెలుగులో చెబుతుంటే.. ఆ పార్టీ నేత మాత్రం.. లోకేష్ ఆల్ రెడీ దీంపై మానిటరింగ్ చేస్తున్నారని ఇంగ్లిష్ లో చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీనే కాదు, కేంద్రంలోని ఆ పార్టీ మంత్రులు, వారి శాఖలను సైతం లోకేష్ తన కనుసన్నాల్లో ఉంచుకున్నారని చెప్పాలనుకుంటున్నారా?

ఇదే సమయంలో.. ప్రధానంగా లోకేష్ ని జాతీయ స్థాయిలో బద్నాం చేసినట్లు చెబుతోన్న వేళ.. జగన్ కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు ఆయన స్నేహితుడు దీపర్ రెడ్డి కుట్రం చేశారా?

ప్రస్తుతం అటు ఏపీ రాజకీయాల్లోనూ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ డిస్కషన్స్ లోనూ ఈ తరహా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అంటున్నారు. అవన్నీ పూర్తిగా ఊహాగాణాలతో కూడిన ప్రశ్నలే అన్నట్లు అనిపించినా.. ఈ వ్యవహారాన్ని పూర్తిగా దీపక్ రెడ్డిని బాధ్యుడ్ని చేసి, పెద్దలు తప్పించుకునే ఆలోచనా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్న పరిస్థితి.

ఓ జాతీయ టీవీ చానెల్‌, టీడీపీ మ‌ధ్య వార్ ప‌తాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు, షార్ట్ వీడియోలు, ట్రోలింగ్ వీడియోలతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ క్రమంలో… ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కాస్తా జాతీయ స్థాయిలో టీడీపీని, ఆ పార్టీ నుంచి పౌర విమాన‌యాన‌శాఖ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రామ్మోహ‌న్‌ నాయుడిని బద్నాం చేసిందని అంటున్నారు.

పైగా ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇండిగో యాజమాన్యం చుట్టూ నడవాల్సింది పోయి… టీడీపీ, లోకేష్ బద్నాం అవ్వడానికి కారణం అయ్యింది ఆ పార్టీ సీనియర్ నేత దీపక్ రెడ్డి అనే చెప్పాలి. ఈ డిస్కషన్ లో.. ‘లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు’ అని దీపక్ రెడ్డి చెప్పడం.. ఆయనకేమి సంబంధం, ఆయన ఏవియేషన్ మినిస్టర్ కాదే అన్న స్థాయిలో సదరు జర్నలిస్టు ప్రశ్నించడంతో.. డ్యామేజీ మరింత ఎక్కువైందని అంటున్నారు.

ఈ సమయంలో టీడీపీ తనదైన శైలిలో ఓ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిని ప్రశ్నించినందుకో.. తమ పార్టీ కీలక నేత లోకేష్ గురించి నిలదీసినందుకో ఆ చానల్ డిబేట్స్ ను బహిష్కరించింది. అయితే… దీనివల్ల తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయ్యిందనే చర్చ జరుగుతుంది.

అలా కాకుండా… ఆ ఛానల్ డిబేట్ లో, లేక.. స్పెషల్ ఇంటర్వ్యూకో కేంద్రమంత్రి రామ్మోహన్ ని పంపించి.. జరిగిన డ్యామేజ్ ని ఎంతో కొంత క్లియర్ చేసుకుని ఉంటే అది మరోలా ఉండేదని అంటున్నారు పరిశీలకులు. ఆ దిశగా ఆలోచించకుండా.. ప్రశ్నించిన ప్రతీ ఛానల్ ను బహిష్కరించుకుంటూ పోతే.. రాష్ట్ర స్థాయిలో ఆ సమస్య లేదు కానీ.. జాతీయ స్థాయిలో ఇబ్బందే అని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దీపక్ రెడ్డి.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్నేహితుడు! ఈ నేపథ్యంలో… తాజా డ్యామేజ్ లో దీపక్ రెడ్డే.. స్నేహితుడి కళ్లల్లో ఆనందం కోసం ఏమైనా కుట్ర పూరితంగా ప్రవర్తించారా అనే సందేహాలతో కూడిన చర్చలు టీడీపీలో జరుగుతున్నాయని అంటున్నారు.

అయితే రాజకీయ విశ్లేషకుల వెర్షన్ మరోలా ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా… మంచో చెడో.. అది లోకేష్ కు సంబంధం ఉన్న శాఖో కాదో.. లోకేష్ కు అవగాహన ఉన్న విషయమో కాదో.. దాన్నీ ఆయనకు ఆపాదించడం వల్ల వచ్చే ఫలితం పాజిటివ్వో నెగిటివో.. అనే స్పృహ లేకుండా… ఆయన మెప్పుకోసమో, భజనలో భాగమో తెలియదు కానీ…. ప్రతీ విషయంలోనూ ఆయన పేరు ప్రస్థావిస్తున్నారని.. ఫలితంగా ఆ టీడీపీ నేతల వల్లే సమస్య చాప కింద నీరులా వ్యాపిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో లోకేష్ కేవలం భజనకు అలవాటు పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు!

రాజీనామా | Journalist Bharadwaj About Arnab Goswami On Ram Mohan Naidu & Nara Lokesh | Indigo | TR